డిసెంబరు 23 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

డిసెంబరు 23 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబరు 23 నుంచి 2023 జనవరి 12 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ బుధవారం రాత్రి షెడ్యూల్ ప్రకటించింది. పగల్​పత్​ఉత్సవాలలో సీతారామచంద్రస్వామి 23న మత్స్య, 24న కూర్మ, 25న వరాహ, 26న నరసింహ, 27న వామన, 28న పరశురామ, 29న శ్రీరామ, 30న బలరామ, 31న శ్రీకృష్ణ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

జనవరి 1న గోదావరిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. 2న తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. జనవరి 2వ తేదీ రాత్రి నుంచి రాపత్​ ఉత్సవాలు షురూ అవుతాయి. విశ్వరూప సేవను జనవరి 19న రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తారు. ముక్కోటి దేవతలు అక్కడ కొలువై భక్తులకు సాక్షాత్కరిస్తారు. జనవరి 12న కూడారై పాశురోత్సవం, 14న భోగి గోదాదేవి కల్యాణం, 15న మకర సంక్రాంతి, రథోత్సవం, ప్రణయ కలహోత్సవం, 16న కనుమ, ఆండాళ్​ అమ్మవారికి తిరువీధి సేవ ఉంటాయని వైదిక కమిటీ షెడ్యూల్​లో ప్రకటించింది.