భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉత్సవమూర్తులకు ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మూలవరులకు సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించి, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకువచ్చారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధనల తర్వాత ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెతో అభిషేకం చేసి, సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం విశేష హారతులు సమర్పించారు. బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం నిర్వహించగా, భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. మధ్యాహ్నిక ఆరాధనల అనంతరం సాయంత్రం దర్బార్ సేవ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.
