వరద బాధితులను ఆదుకునేందుకు డ్రోన్లు వినియోగిస్తాం : జితేశ్​వి.పాటిల్​  

వరద బాధితులను ఆదుకునేందుకు డ్రోన్లు వినియోగిస్తాం : జితేశ్​వి.పాటిల్​  
  • వెలుగు ఇంటర్వ్యూలో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​వి.పాటిల్​  
  • వ్యవసాయానికి పెద్ద పీట, పరిశ్రమలు, టూరిజంపై స్పెషల్​ ఫోకస్​
  • పనిచేయని వాళ్లకు వార్నింగ్, షోకాజ్​నోటీస్, యాక్షన్​
  • ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా, ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా  ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, జిల్లాను అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతానని కొత్త కలెక్టర్​జితేశ్​వి. పాటిల్​తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తానని ‘వెలుగు’తో చెప్పారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

వరదల టైంలో డ్రోన్ల సాయం.. 

గోదావరి వరదల టైంలో బాధితులను ఆదుకునేందుకు ప్రయోగాత్మకంగా జిల్లాలో డ్రోన్ల సాయం తీసుకునేందుకు ప్లాన్​ చేస్తున్నాం. అత్యవసర సమయాల్లో డ్రోన్లతో వరద బాధితులకు నైలాన్​ తాడ్లు, లైఫ్​ జాకెట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గోదావరి వరదలతో పాటు ఇతర వాగులు ఉప్పొంగినప్పుడు ముంపు ప్రాంతాలను గుర్తించి నీటిని తోడేందుకు అవసరమైన మోటార్​ పంపులను అందుబాటులో ఉంచనున్నాం.

భద్రాచలం పట్టణంలోకి వచ్చే వరదను ఎప్పటికప్పుడు తోడే విధంగా మోటార్​ పంపులను స్టాండ్​బై లో ఉంచుతాం. వరదల్లో ప్రాణ నష్టం లేకుండా చూస్తాం. వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఫుడ్​ అందించే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించే ఆలోచేన ఉంది.  

రైతులకు లాభాలు వచ్చేలా..

కొత్త తరహా వ్యవసాయంతో రైతులకు లాభాలు వచ్చేలా ప్లాన్​ చేస్తున్నాం. ఇప్పటికే అగ్రికల్చర్, హార్టికల్చర్​ అధికారులతో స్పెషల్​ మీటింగ్​ పెట్టాం. అత్యధిక లాభాలు వచ్చే ఆయిల్​పాం, మునగ లాంటి పలు పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు జిల్లాలో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో బ్యాంకర్లతో త్వరలో మీటింగ్​ పెడ్తాం. 
ఏఏ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.. బ్యాంకర్ల లోన్లు లాంటి పలు అంశాలపై చర్చిస్తాం. 

టూరిజం, పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్.. 

జిల్లాలో టూరిజానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇల్లెందు క్రాస్​ రోడ్డులోని టూరిజం హోటల్​ను కంప్లీట్​ చేయడంతో పాటు కిన్నెరసాని అందాలను ప్రకృతి ప్రేమికులకు అందించేలా ప్లాన్​ చేయనున్నాం. కారుకొండ రామవరంలోని బుద్ధ వనాన్ని అభివృద్ధి చేస్తాం. కొండలు అధికంగా ఉన్న ఈ జిల్లాలో ట్రెక్కింగ్​ అవకాశాలపై పరిశీలిస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటుకు చాలా అవకాశాలున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. 

కబ్జా చేస్తే సీరియస్​యాక్షన్..

గవర్నమెంట్​ల్యాండ్స్​ను కబ్జా చేసే వారిపై సీరియస్​యాక్షన్​ ఉంటుంది. ఎంతటి వారైనా వదిలేది లేదు. భూములను రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నాం. అవసరమైన చోట ఫెన్సింగ్​ వేస్తాం. 

నాణ్యమైన విద్య, వైదం.. 

క్వాలిటీ ఎడ్యుకేషన్​తో  పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేలా కృషి చేస్తాం. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు తర్వగా పూర్తి చేసేలా చూస్తున్నాం. ‘మన ఊరు–మన బడి’ పెండింగ్​పనులనూ పూర్తి చేసేలా ప్లాన్​ చేస్తున్నాం. స్కూళ్లలో టీచర్లు సమయ పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్య సేవలందించేలా ఆదేశాలిచ్చాం. వరదలు, వ్యాధుల సీజన్​ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించాం. ఖాళీ డాక్టర్​ పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్ట్​ పద్ధతిలో నోటిఫికేషన్​ ఇవ్వనున్నాం. మెడికల్​ కాలేజ్​తో పాటు జిల్లా జనరల్​ హాస్పిటల్, మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్​లో గ్రూపుల గొడవలపై సీరియస్​గా యాక్షన్​ తీసుకుంటాం. తాగునీటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాం. 

ఏ సమస్యలున్నా నా దృష్టికి తేవాలి.. 

ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తేవాలి. వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఈ విషయమై ఇప్పటికే ఇంజినీరింగ్​ ఆఫీసర్లకు సూచించాను. ఏ ఒక్క పని పెండింగ్​లో ఉన్నా ఊరుకునేది లేదు. స్కూళ్లను,  హాస్పిటళ్లను ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తాను. ఏజెన్సీ ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్​నెట్​ సేవలందేలా టెలికాం శాఖాధికారులతో రివ్యూ చేస్తా. 

తీరు మార్చుకోకపోతే చర్యలు.. 

పనిచేయని అధికారులకు ఫస్ట్​ వార్నింగ్​ ఇస్తా. అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే షోకాజ్​ నోటీసులు ఇవ్వడం, చర్యలు తీసుకోవడం చేస్తా. అధికారులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. 

మంత్రుల సహకారంతో సమగ్రాభివృద్ధికి కృషి 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా ఇన్​చార్జి మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో జిల్లాను సమగ్రాభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తా. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రజా సమస్యల పరిష్కారాని పెద్ద పీట 
వేస్తాను.