ఎన్నికల కోడ్..పకడ్బందీగా అమలు చేయాలి

ఎన్నికల కోడ్..పకడ్బందీగా అమలు చేయాలి
  • జిల్లాలో 9,45,094 మంది ఓటర్లు
  • 1095 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు
  • 1950 నెంబర్​తో కంట్రోల్​ రూం
  • కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలో  అసెంబ్లీ ఎన్నికల  షెడ్యూల్​ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎలక్షన్​ కోడ్ ను పకడ్బందీగా అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట్ లో  సోమవారం విలేకర్ల సమావేశంలో ఎన్నికల కోడ్​ అమలుపై అమె మాట్లాడారు. నవంబర్​ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఈ నెల 30 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయడానికి ఫ్లయింగ్​ స్క్వాడ్​ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇల్లెందు, పినపాక, భద్రా చలం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వేషన్​ కాగా, కొత్తగూడెం జనరల్​ నియోజకవర్గమని చెప్పారు. ఐదు నియోజకవర్గాల్లో 27 మండలాలు ఉన్నాయన్నారు

జిల్లాలో 9,45,094 మంది ఓటర్లున్నారని వివరించారు. మొత్తం1095పోలింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్బన్ ​పోలింగ్​స్టేషన్లు 181, రూరల్​ పోలింగ్​ స్టేషన్లు 914,  క్రిటికల్​ పోలింగ్​ స్టేషన్లు 294 ఉన్నాయన్నారు. జిల్లాలో కొండ రెడ్లకు సంబంధించి వందశాతం ఓటర్లుగా నమోదు చేశామన్నారు. జిల్లాలో 18,19 మధ్య వయసు గల ఓటర్లు 22,096 మంది, 80 ఏండ్లకు పైబడిన ఓటర్లు13,082 మంది ఉన్నారని తెలిపారు. 80 ఏండ్లకు పైబడిన వారితో పాటు దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పోలింగ్​ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.

మోడల్​ పోలింగ్​ కేంద్రం

 ప్రతి నియోజకవర్గంలో మోడల్​ పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గవర్నమెంట్​ఆఫీస్​లలో రాజకీయ పార్టీల హోర్డింగ్​లు, ఫోటోలు, ఫ్లెక్సీ లను 24గంటల్లో తొలగించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ లో 1950  కంట్రోల్​ రూం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మీడియా సెంటర్​ ఏర్పాటుతో పాటు ఎన్నికల విధులు నిర్వహించే వారికి ట్రైనింగ్​ ప్రోగ్రాంలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 

 ఎస్పీ డాక్టర్​ వినీత్​ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్​ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడ్తున్నామన్నారు. 223 పోలింగ్​ కేంద్రా లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. బార్డర్​ చెక్​ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రచారం చేయరాదన్నారు. ప్రెస్​మీట్​లో డీపీఆర్​ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి

ఖమ్మం టౌన్,వెలుగు : జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. సోమవారం  కలెక్టరేట్ లో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి ఎన్నికల కోడ్ పై అమలుపై ఎంసీసీ, ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున సోమవారం మధ్యాహ్నం నుంచి డిసెంబర్ 5 వరకు ఎన్నికల కోడ్ ను కచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లను, ఎస్ఎస్టీ టీంలను యాక్టివ్​ చేయాలన్నారు. నగదు రవాణా జరుగకుండా గట్టి నిఘా పెట్టాలన్నారు. సీ విజిల్ యాప్ పై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.

స్టార్ క్యాంపెనర్ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. టీంల వాహనాలకు ఎన్నికల కమిషన్ లోగోతో పాటు, కెమెరా, జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలన్నారు.  సీపీ విష్ణు వారియర్ మాట్లాడుతూచెక్ పోస్ట్ ల వద్ద నిఘా పటిష్టం చేయాలన్నారు. సిబ్బందికి కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, మధుసూదన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎఫ్​వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ ప్రసాద్ రావు, ఆర్డీవోలు, ఏసీపీలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.