కొత్తగూడెం కార్పొరేషన్‌‌‌‌పై  ఎర్రజెండా..కాంగ్రెస్, సీపీఐలకు చెరో 22 సీట్లు 

కొత్తగూడెం కార్పొరేషన్‌‌‌‌పై  ఎర్రజెండా..కాంగ్రెస్, సీపీఐలకు చెరో 22 సీట్లు 
  • సీపీఐకి మేయర్​ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌‌‌‌ ఓకే
  •  కూనంనేనికి సీఎం ఫోన్‌‌‌‌తో మారిన సీన్​
  • అటు బేషరతుగా మద్దతు ఇస్తామన్న కేటీఆర్‌‌‌‌

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణలో మొదటిసారిగా ఓ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌పై ఎర్రజెండా ఎగరనుంది. భద్రాద్రి జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పీఠం సీపీఐకి దక్కే అవకాశం వచ్చింది. శుక్రవారం విడుదలైన  ఎన్నికల ఫలితాల్లో కొత్తగూడెం కార్పొరేషన్‌‌‌‌లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోగా.. కాంగ్రెస్‌‌‌‌, సీపీఐకి సమానంగా సీట్లు దక్కాయి. దీంతో ఈ మేయర్‌‌‌‌ పీఠం సీపీఐకి ఇచ్చేందుకు ఇటు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, అటు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ సిద్ధమయ్యారు. కాగా, సీఎం రేవంత్​ స్వయంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఫోన్‌‌‌‌ చేయడంతో కాంగ్రెస్​, సీపీఐ కలిసిపోతాయనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌‌‌‌, సీపీఐకి చెరో 22 సీట్లు

 కొత్తగూడెం మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. మంగళవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌‌‌‌, సీపీఐ చెరో 22 డివిజన్లలో విజయం సాధించగా.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ 8, ఇండిపెండెంట్లు ఆరుగురు, బీజేపీ, సీపీఎం ఒకటి చొప్పున డివిజన్లు దక్కించుకున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి కూడా మేజిక్‌‌‌‌ ఫిగర్‌‌‌‌ దక్కకపోవడంతో హంగ్‌‌‌‌ ఏర్పడింది. దీంతో ఈ కార్పొరేషన్‌‌‌‌ను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఇటు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, అటు కాంగ్రెస్‌‌‌‌ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఇందులో భాగంగా సీపీఐకి మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంపై సీపీఐ స్టేట్‌‌‌‌ సెక్రటరీ కూనంనేని సాంబశివరావుతో సైతం ఫోన్‌‌‌‌లో మాట్లాడగా.. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూనంనేని చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు సీపీఐకి మేయర్‌‌‌‌ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌‌‌‌ సైతం ముందుకు వచ్చింది.

మేయర్‌‌‌‌ పీఠం విషయంపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్వయంగా కూనంనేనితో మాట్లాడినట్లుగా ప్రచారం సాగుతోంది. మేయర్‌‌‌‌ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌కు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఎవరికి వారే పోటీ చేసినా.. చివరకు ఒక్కటై..!

కొత్తగూడెం కార్పొరేషన్‌‌‌‌లో కలిసి పోటీ చేసేందుకు మొదట్లో కాంగ్రెస్‌‌‌‌, సీపీఐ నాయకులు ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం ఇరు పార్టీల మధ్య వారం రోజుల పాటు చర్చలు సైతం నడిచాయి. కానీ  ఫలించకపోవడంతో సీపీఐ, కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు ఎవరికి వారుగా బరిలోకి దిగారు. ఇప్పుడు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం, హంగ్‌‌‌‌ ఏర్పడడంతో సీపీఐకి మరో పార్టీతో కలవడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌‌‌‌తోనే కలిసి మేయర్‌‌‌‌ పదవి దక్కించుకోనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

మేయర్‌‌‌‌ పీఠం సీపీఐదే : సీపీఐ స్టేట్‌‌‌‌ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం కార్పొరేషన్‌‌‌‌ మేయర్‌‌‌‌ స్థానం సీపీఐదేనని ఆ పార్టీ స్టేట్‌‌‌‌ సెక్రటరీ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం పాల్వంచలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌‌‌‌ తనకు ఫోన్‌‌‌‌ చేసింది వాస్తవమేనని, మేయర్‌‌‌‌ ఎన్నిక కోసం బేషరతుగా తమకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. 51వ డివిజన్‌‌‌‌ నుంచి గెలిచిన దుర్గాప్రసాద్‌‌‌‌ సైతం తమకే మద్ధతు ఇస్తామని చెప్పారన్నారు.

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు తెచ్చుకున్నామన్నారు. కార్పొరేషన్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీతో కలిసిపోవడంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన పట్టణ ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్పొరేషన్‌‌‌‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సమావేశంలో సీపీఐ జాతీయ నాయకులు భాగం హేమంతరావు, ముత్యాల విశ్వనాథం, పట్టణ, మండల కార్యదర్శులు సాయిబాబా, వీసంశెట్టి పూర్ణ పాల్గొన్నారు.