
- డిప్యూటీలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ ప్రమాణ స్వీకారం
- ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ హాజరు
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ తన పుట్టినరోజు నాడే బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం జైపూర్‌లోని ప్రఖ్యాత ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో శర్మతో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా కూడా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్, తాజా మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, గోవా సీఎం ప్రమోద్ సావంత్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ ఎమ్మెల్యేలు, యోగులు, మహంత్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుదీర్ఘ కాలంపాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన భజన్‌లాల్ శర్మ.. ఈ ఎన్నికల్లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తం: ప్రధాని మోదీ
రాజస్థాన్ కొత్త సీఎం భజన్‌లాల్ శర్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలను ప్రధాని మోదీ తెలియజేశారు. అంకితభావంతో పని చేసే బీజేపీ కార్యకర్త అని, పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటూ ఆయనకు సూచించారు. రాష్ట్ర ప్రజల నమ్మకం, ఆశలను నిలబెట్టేందుకు రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎంలు దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాకు శుభాకాంక్షలు తెలిపారు.
పక్కపక్కనే ఉప్పు - నిప్పు
కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ కార్యక్రమానికి కాస్త ముందుగానే వచ్చారు. తన ప్రత్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్ పక్కనే కూర్చున్నారు. ప్రోగ్రాంకు ముందు వీరిద్దరూ మాట్లాడుకోడటం కనిపించింది. ఇటీవల వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. సంజీవనీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ స్కామ్‌కు పాల్పడ్డారంటూ గజేంద్ర సింగ్‌పై గెహ్లాట్ ఆరోపణలు చేశారు. దీంతో గెహ్లాట్‌పై షెకావత్ పరువు నష్టం దావా వేశారు. మరోవైపు సీఎం పదవి కోసం చివరి దాకా పోటీ పడిన మాజీ సీఎం వసుంధర రాజే కూడా షెకావత్ పక్కనే కూర్చున్నారు.