బుధవారం భారత్ బంద్.. బ్యాంకు సేవలపై ఎఫెక్ట్

బుధవారం భారత్ బంద్.. బ్యాంకు సేవలపై ఎఫెక్ట్

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. 14 డిమాండ్లతో కేంద్ర కార్మిక శాఖకు సెప్టెంబర్ చివరిలోనే స్ట్రయిక్ నోటీసులు ఇచ్చాయి పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రిత్వ శాఖతో ఈ నెల 2న ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఎల్పీఎఫ్, యూటీయూసీ  సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చర్చలు విఫలం కావడంతో జనవరి 8న భారత్ బంద్ చేపట్టాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ బంద్‌లో దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటారని వారు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రైవేటు రవాణాపై ఎఫెక్ట్ పడబోతోంది.

బ్యాంకు ఉద్యోగ సంఘాల మద్దతు

ఈ భారత్ బంద్‌కు పలు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు మద్దతు ప్రకటించాయి.  ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సహా పలు బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు తాము స్ట్రయిక్‌లో పాల్గొంటున్నామని తెలిపాయి. దీంతో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల సేవలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లపై ఎటువంటి ఎఫెక్ట్ పడదు.

రాజకీయ పార్టీల మద్దతు.. నో చెప్పిన దీదీ

రేపు (బుధవారం) జరిగే భారత్ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వామపక్షాలతో పాటు డీఎంకే, ఎండీఎంకే, శివసేన, బిజూ జనతా దళ్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు కార్మిక సంఘాలకు అండగా బంద్‌లో పాల్గొనాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం మద్దతు తెలిపేందుకు నిరాకరించారు. తమ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఈ బంద్‌లో పాల్గొన్నవద్దని సూచించారామె. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు బంద్‌లో పాల్గొంటే యాక్షన్ తప్పదని హెచ్చరించాయి. ఉద్యోగులెవరైనా నిరసనల్లో పాల్గొంటే జీతం కోతతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మెమొరాండం జారీ చేశాయి.