ప్రధాని సూచనలు చూస్తే.. ఆర్థిక సంక్షోభం రానుందా?

ప్రధాని సూచనలు చూస్తే..  ఆర్థిక సంక్షోభం రానుందా?

భారత్  నిజంగానే  ఆర్థిక సంక్షోభం దిశగా  వెళ్తుందా?  బయటకు  ప్రపంచంలో  వేగంగా ఎదుగుతున్న శక్తిగా,  విశ్వగురు,  5 ట్రిలియన్ ఎకానమీ  అనే నినాదాలతో  గంభీరంగా కనిపిస్తున్నా... మన  ఆర్థిక వ్యవస్థపై  తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందా?  అమెరికా,  ఇరాన్ ఉద్రిక్తతలు,  మధ్యప్రాచ్య యుద్ధ వాతావరణం,  హార్మూజ్ జలసంధిలో  నెలకొన్న అనిశ్చితి ఇవన్నీ భారత ఆర్థిక భవిష్యత్తుపై  నిశ్శబ్ద తుపానులా మారుతున్నాయా?  

మొన్నటివరకు ఎన్నికల వేళ ‘చమురుకు ఎలాంటి ఢోకా లేదు’ అని  భరోసా  ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు  మాత్రం  ప్రజలకు  బంగారం కొనొద్దని,  పెట్రోల్ వినియోగం తగ్గించుకోవాలని, వంటనూనెలు పొదుపుగా వాడాలని, అవసరం లేని విదేశీ  ప్రయాణాలు మానుకోవాలని సూచనలు చేయడం యాదృచ్ఛికం కాదు. హైదరాబాద్‌‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక పరిస్థితిపై కొత్త చర్చకు తెరలేపాయి.  

ఒకవైపు రూపాయి  విలువ పడిపోతుండటం,  మరోవైపు చమురు,  బంగారం, యూరియా వంటి కీలక దిగుమతుల భారం పెరుగుతుండటంతో  భారత విదేశీ మారక నిల్వలపై  ఒత్తిడి తీవ్రమవుతోంది.  ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగసిపడుతుండగా,  యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు.  

ఈ  పరిస్థితుల్లో ప్రధాని మోదీ చేసిన ‘వినియోగ నియంత్రణ’ విజ్ఞప్తులు కేవలం పొదుపు సూచనలు మాత్రమేనా?  లేక దేశ ఆర్థికవ్యవస్థలో లోతుగా పెరుగుతున్న  అసమతుల్యతకు సంబంధించిన హెచ్చరికలా? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  అభివృద్ధి అంటే కేవలం ఎక్స్‌‌ప్రెస్ హైవేలు కాదు. షేర్ మార్కెట్ రికార్డులు కాదు. బిలియనీర్ల  సంఖ్య కాదు. ఒక సాధారణ కుటుంబం భయపడకుండా  బతకగలగడం.  పిల్లల  భవిష్యత్తుపై నమ్మకం కలిగి ఉండడం. ధరలు చూసి వంటగదిలో ఆందోళన చెందకపోవడం... అదే నిజమైన అభివృద్ధి. 

  • ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా చమురు

 ప్రపంచంలో అతిపెద్ద వినియోగ మార్కెట్లలో భారత్  ఒకటి.  కానీ, అదే సమయంలో అత్యధికంగా దిగుమతులపై  ఆధారపడుతున్న దేశంగా మారుతోంది.  చైనా,  అమెరికా తర్వాత  అతిపెద్ద చమురు దిగుమతిదారు భారత్, గతేడాది  ఏప్రిల్  నుంచి ఈ ఏడాది మార్చి మధ్యలో 123 బిలియన్ డాలర్ల విలువైన  చమురు దిగుమతి  చేసుకున్నాం. 

ఇటీవల అమెరికా ఒత్తిడితో రష్యా  నుంచి చౌకగా చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాల్సి వచ్చింది.  ప్రపంచ మార్కెట్లో చమురు ధర పెరిగితే  భారత్‌‌లో బస్సు ఛార్జీ పెరుగుతుంది.  గ్యాస్ ధర పెరుగుతుంది.  కూరగాయల రవాణా ఖర్చు పెరుగుతుంది. చివరికి సామాన్యుడి  భోజనపు ఖరీదు కూడా పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థకే ఇంధనంగా ఉండే చమురు వినియోగాన్ని తగ్గించడం కష్టమే.

  • విదేశీ మారకద్రవ్యం  కాపాడుకోవడం..

మనం అత్యధికంగా విదేశీ మారకాన్ని ఖర్చు చేస్తు న్నవాటిలో  రెండో స్థానంలో  బంగారమున్నది. 2025-–26లో 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం.  ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆకో ప్రకారం 2023-–24లో భారతీయులు 31.7 బిలియన్  డాలర్లు విదేశీ ప్రయాణాలకు ఖర్చు పెట్టారు. 

2023లో 2.79 కోట్ల మంది భారతీయులు విదేశీ ప్రయాణాలకు వెళ్లగా 2024లో 3.09 కోట్ల మందికి పెరిగారు.  గతేడాది కోటి టన్నుల యూరియాను మనం దిగుమతి చేసుకున్నట్టు  ఎస్ అండ్ పీ  గ్లోబల్  పేర్కొంది.  జనాభాలో సగానికి మించి కర్షక కుటుంబాలున్న మన దేశంలో ఫర్టిలైజర్ వినియోగాన్ని తగ్గించడమూ దాదాపు అసాధ్యమనే నిపుణులు  చెబుతున్నారు.  మొత్తం మీద విదేశీ మారకద్రవ్యాన్ని  కాపాడుకోవడం మన దేశానికి అవసరమే. కానీ ఎంతవరకు అది సాధ్యమనేది ప్రజల 
వినియోగంపైనే ఆధారపడి ఉంది.

  • దెబ్బతీస్తున్న రూపాయి 

రూపాయి  విలువ పడిపోవడం అంటే  కేవలం కరెన్సీ మార్పిడి సమస్య కాదు.  దాని అర్థం దిగుమతుల ఖర్చు పెరుగుతుంది,  ద్రవ్యోల్బణం పెరుగుతుంది,  పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో బ్యారెల్​కి  సుమారు 70 డాలర్ల వద్ద ఉన్న చమురు ధరలు ఇటీవల 120 డాలర్లకు  చేరువయ్యాయి.  

ఇదే  సమయంలో భారత రూపాయి విలువ సైతం  బలహీనపడుతూ డాలర్​తో  పోలిస్తే  రికార్డు కనిష్టాల వద్ద  ట్రేడవుతోంది.   ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు  సుమారు $690  బిలియన్ల వద్ద ఉన్నప్పటికీ,  భారీ దిగుమతుల ఒత్తిడి కొనసాగితే  పరిస్థితి  ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇరాన్ యుద్ధానికి  ముందు(ఫిబ్రవరి 28కు ముందు) బ్యారెల్  క్రూడాయిల్ ధర 72.87 డాలర్లుండగా.. ఈ ధర 105.45 డాలర్లకు  చేరుకుంది. అంటే దాదాపు 50 శాతం పెరిగింది.  ఇక మన విదేశీ మారక నిధులను పరిశీలిద్దాం. 

మే 1నాటికి మన దగ్గర 690.69 బిలియన్ డాలర్లు ఫారీన్ ఎక్స్చేంజ్  రిజర్వులున్నాయి.  ఇది మార్చి చివరినాటి కన్నా 7.79 బిలియన్ డాలర్లు తక్కువ.  యుద్ధానికి ముందు (ఫిబ్రవరి 27)న ఈ విలువ 728.5బిలియన్ డాలర్లు. 2026లో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 84 బిలియన్ డాలర్లు లోటుగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.  అంటే మనం సాధారణంగా ఖర్చు చేయాల్సినదానికి మించి చేస్తున్నట్టు లెక్క. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు.  దేశ స్వావలంబనకు సంబంధించిన ఓ ప్రశ్న.

అభివృద్ధి గణాంకాల్లోనేనా? 

ఒకప్పుడు  ప్రభుత్వం ప్రజలకు రక్షణగా ఉండేది.  గ్యాస్  సబ్సిడీ,  ఎరువుల  సబ్సిడీ,  ఆహార భద్రత,  విద్యుత్ సబ్సిడీలు ఇవి సామాన్యుడికి ఊరటనిచ్చేవి.  ఇప్పుడు పరిస్థితి  క్రమంగా  మారుతోంది.  తగ్గించుకోండి.. పొదుపుగా వాడండి.  అవసరం అయితేనే  కొనండి అనే సందేశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.   దేశ జీడీపీ పెరుగుతుందని చెబుతున్నారు.  కానీ సామాన్యుడి ఈఎంఐ కూడా పెరుగుతోంది.  పెట్రోల్ ధరలు,  వంటనూనెల ధరలు, గ్యాస్ ధరలు,  పప్పులు,  కూరగాయలు,  విద్య,  వైద్యం ఖర్చులు అన్నీ పెరుగుతున్నాయి. కానీ  సంపాదనలు అదేస్థాయిలో లేవు,  ఒక మధ్యతరగతి  కుటుంబం పరిస్థితి ఇలా మారింది. 

జీవితం కోసం సంపాదిస్తున్నామా?  లేక  ఖర్చులు తీర్చడానికి  బతుకుతున్నామా?  ఇది ఆర్థిక  క్రమశిక్షణ  కోసమా?  లేక ప్రభుత్వాల ఆర్థిక బలహీనత బయటపడుతున్న సంకేతమా?  సబ్సిడీ  తగ్గితే ధనికుడు బతుకుతాడు.  కానీ  పేదవారు? మధ్యతరగతి ప్రజల పరిస్థితేంటి? వారి జీవితమే  లెక్కల పట్టికగా  మారిపోతుంది.  ఇదే నిజమైన సంక్షోభ సూచిక.  దేశంలో  ఆకలి గణాంకాలు,  నిరుద్యోగం,  యువతలో అసహనం,  బ్యాంక్ వడ్డీలు  భద్రత ఇవ్వడం లేదు,  ఉద్యోగ భరోసా  తగ్గుతోంది,  వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి.   భవిష్యత్తుపై  అనిశ్చితి పెరుగుతోంది.  ఇవన్నీ కలిపి చూస్తే ‘అభివృద్ధి’ కేవలం  గణాంకాల్లోనే  ఉందా  అన్న  సందేహం వస్తోంది.

పరిష్కార మార్గాలు! 

మొదటిది  ఇంధన విప్లవం అవసరం,  గ్రీన్ హైడ్రోజన్ & ఇథనాల్,  ఇథనాల్  బ్లెండింగ్‌‌ను 20% నుంచి 30% వరకు వేగంగా పెంచాలి.   గ్రీన్  హైడ్రోజన్ రంగంలో  భారత్  ప్రపంచ నాయకత్వం సాధించాలి, ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్,  ఈవీ  వాహనాలకే కాదు,  బ్యాటరీ తయారీకి కూడా భారీ ప్రోత్సాహం ఇవ్వాలి.  పబ్లిక్  ట్రాన్స్‌‌పోర్ట్  ఎలక్ట్రిఫికేషన్  వేగవంతం చేయాలి.  

రెండోది  వ్యవసాయాన్ని  స్వావలంబన  కేంద్రంగా మార్చాలి.   నానో యూరియా, యూరియా  దిగుమతులపై  ఆధారాన్ని తగ్గిస్తుంది,  నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  ప్రకృతి వ్యవసాయం, రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది,  రైతు ఆదాయం పెరుగుతుంది.  ఆరోగ్యకరమైన  ఆహార వ్యవస్థ ఏర్పడుతుంది.  మూడోది  రూపాయి రక్షణకు  ధైర్యమైన  నిర్ణయాలు,  గోల్డ్  మోనటైజేషన్  స్కీమ్ పునర్వ్యవస్థీకరణ,  ప్రజల వద్ద ఉన్న వేల టన్నుల  బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి  తీసుకురావాలి.  

రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్యం, రష్యా, యూఏఈ,  బ్రిక్స్​ దేశాలతో  రూపాయి  ఆధారిత వాణిజ్యాన్ని విస్తరించాలి.   నాలుగోది  యువతకు ఉద్యోగాలు.. ఇదే నిజమైన ఆర్థిక సంస్కరణ,   దేశానికి  అతిపెద్ద బలం యువజన శక్తి.   కానీ  నిరుద్యోగ యువత,  ఆర్థిక అస్థిరతకు, సామాజిక అసంతృప్తికి,   తీవ్రమైన  మానసిక  ఒత్తిడికి దారితీస్తుంది. సెమీకండక్టర్లు,  ఏఐ, డిఫెన్స్,  మాన్యుఫాక్చరింగ్,  గ్రీన్ ఎనర్జీ రంగాల్లో  భారీ ఉద్యోగ  అవకాశాలు  సృష్టించాలి.  భారత్  ముందుకు సాగుతోంది.  ఇది నిజం.  కానీ ఆ ప్రయాణంలో  సామాన్యుడి శ్వాస మాత్రం  ఎప్పుడూ ఆగిపోకూడదు.  ఎందుకంటే  దేశ బలం కేవలం ఆర్థిక గణాంకాల్లో కాదు.  ప్రజల మనసుల్లో ఉంటుంది. 

- డా. కేశవులు
భాషవత్తిని
ఎండీ