త్వరలోనే మెగా డీఎస్సీ ... జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నం: భట్టి

త్వరలోనే మెగా డీఎస్సీ ...  జాబ్  క్యాలెండర్ తయారు చేస్తున్నం: భట్టి
  • నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడి
  • టీఎస్​పీఎస్సీకి రూ.40 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, వెలుగు:  ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించి జాబ్  క్యాలెండర్  తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. శనివారం అసెంబ్లీలో భట్టి మాట్లాడారు. నిరుద్యోగుల మెరుగైన జీవితానికి బాటలు వేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇది తమ  వాగ్దానం మాత్రమే కాదని, తమ విధానమని వెల్లడించారు. గత సర్కారు చేసిన పనులతో యూత్​లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని, భవిష్యత్తుపై వారు ఆశను కోల్పోయారని గుర్తుచేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుకు కాంగ్రెస్  గ్యారంటీ ఇవ్వడంతో, వారంతా తమ వెనుక నిలిచారని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం జాబ్  క్యాలెండర్  తయారు చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు.

 ‘‘నిరుద్యోగ యువకులను అక్కున చేర్చుకుంటం. వారికి అండగా ఉంటం. స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికేలా చూస్తం” అని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మెగా డీఎస్సీ, 15 వేల కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్​ను పూర్తిచేసి, నియామక పత్రాలు అందిస్తామని స్పష్టంచేశారు. గ్రూప్​ 1లో మరిన్ని పోస్టులు కలుపుతున్నామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్  సర్కారు పదేండ్లలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిందన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పబ్లిక్  సర్వీస్  కమిషన్​ను ప్రక్షాళన చేశామని, తాజాగా రూ.40 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు.