కేసీఆర్​ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది

  కేసీఆర్​ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది

ఎల్కతుర్తి, హసన్​పర్తి, కమలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్​ ప్రభు త్వాలు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.  కేంద్ర హోం మంత్రి అమిత్​ షా  ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని  ఆరోపించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్​ మార్చ్​ పాదయాత్ర సోమవారం కమలాపూర్​ మండలం నుంచి ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లికి చేరుకుంది.  పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్​ కట్​ చేశారు. అనంతరం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా చేసిన కామెంట్స్​ ఒక మతానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.  రాజ్యాం గం ఇచ్చిన రిజర్వేషన్లను తొలగిస్తానని చెప్పిన హోం మంత్రి కామెంట్స్ పరోక్షంగా సీఎం కేసీఆర్ కు మద్దతు ఇస్తున్నట్టే ఉన్నాయన్నారు. ఎస్సీలు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని చెబుతున్నారని, అసలు కొత్తగా ఇచ్చేది ఏముందో చెప్పాలన్నారు. బీసీల జనగణన చేపట్టాలని కాంగ్రెస్​ డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. బీసీ జనగణన చేపట్టకుండా రెండు పార్టీలు నాటకమాడుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీకి లొంగిపోయిందని, ఆ రెండు పార్టీలూ ఒక్కటే అని విమర్శించారు.  హసన్​పర్తిలో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్​ హయాంలో పంచిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం సరికాదన్నారు. ధరణి పోర్టల్​ తీసుకొచ్చి పేదల భూములను పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.  

ధాన్యం తడుస్తున్నా పట్టించుకుంటలేరు

అకాల వర్షాలతో కల్లాలు, రోడ్లపై ఎక్కడికక్కడ ధాన్యం తడిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భట్టి ఫైర్​ అయ్యారు. పాదయాత్ర సందర్భంగా మార్గమధ్యలోని  తడిసిన ధాన్యం కుప్పలను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలపై ఆరా తీశారు. అనంతరం బావుపేట క్రాస్​ వద్ద భట్టి మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని, రాష్ట్ర సంపద మొత్తం కల్వకుంట్ల కుటుంబ ఖాతాలోకే వెళ్తోందని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కరీంనగర్​ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు సాంబయ్య, రాముడు, మల్లారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మహేందర్​ పాల్గొన్నారు.