ఎన్ని అడ్డుంకులొచ్చినా 6 గ్యారంటీలు అమలు చేస్తాం: భట్టి విక్రమార్క

ఎన్ని అడ్డుంకులొచ్చినా 6 గ్యారంటీలు అమలు చేస్తాం: భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ పాలనలో గత 10 సంవత్సరాల్లో ప్రజల సంపద దోపిడీకి గురైందని అన్నారు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా..  కాంగ్రెస్ ప్రభుత్వం  దోపిడీ చేయకుండా ప్రజల సంపదను ప్రజలకే పంచిపెడుతుందన్నారు.  అమలు చేయని 3 ఎకరాల హామీ మాదిరిగానే 6 గ్యారంటీలు అమలు కాకుండా ఉంటే బాగుండు అని కొంత మంది బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారని..కానీ,  వారి ఆలోచనలు సాగవన్నారు. 

ఎన్ని  అడ్డంకులు వచ్చినా.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని.. 100 రెజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం. జనవరి 6వ తేదీ శనివారం ఖమ్మంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో భట్టీ విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని..  ప్రభుత్వం ఏర్పడినా మొదటి గంటలోనే మహాలక్ష్మి కార్యక్రమం అమలుచేశామని చెప్పారు.  

గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టకోలేదని మండిపడ్డారు. ఎవరు ఆందోళన చెందవొద్దని..  ఇచ్చిన ప్రతిమాట కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందన్నారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని.. భవిష్యత్తు ప్రాణాళికలు తట్టుకోలేనంతగా రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ 10 ఏళ్ళ పాలనలో ప్రజల కలలు కలలుగానే మిగిలిపోయానన్నారు. గత ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని.. అందుకే శ్వేత పత్రాలను విడుదల చేశామని చెప్పారు. మేం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నామన్నారు.