
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటన సీజన్ రాక ముందే కోయిల కూసినట్లు ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ నేతలు పార్టీలు మారుతారనే ఆందోళనలోనే సీఎం కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన చేశారని ఆయన విమర్శించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో భట్టి మాట్లాడారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం బీఆర్ఎస్ ఓటమికి సంకేతమన్నారు. గజ్వేల్ లో ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్.. కామారెడ్డికి పోతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కే దిక్కులేకపోతే ఇక ఆయన బొమ్మతో మిగతా వారెలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఎవరు ఎక్కడ పోటీచేసినా గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనతో నష్టపోయిన వారందరూ కాంగ్రెస్ తో కలిసిరావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ సైతం ఆన్ టైంలోనే అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టింది.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నం. 50 ఏండ్ల లో కాంగ్రెస్ ఏమీ చేయలేదని కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్ మెంట్ ప్రొగ్రాంను మరింత ఉధృతంగా తీసుకెళ్తం. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ముందు నిలబడి సెల్ఫీ దిగి సోషల్ మీడియా లో పోస్టులు పెట్టి ప్రజలకు వాస్తవాలు చెబుతం” అని భట్టి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే ను కలిసి తాను చేపట్టిన పాదయాత్ర విశేషాలు, రాష్ట్రంలోని సమస్యలను వివరించానని ఆయన వెల్లడించారు