డాలర్ల ఇష్యూపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీ

డాలర్ల ఇష్యూపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీ
  • యాదగిరిగుట్ట ఆలయ ఈవో గా భవానీ శంకర్ బాధ్యతల స్వీకరణ
  • ఆలయంలో అవినీతి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రచార శాఖలో మాయమైన నారసింహుడి ప్రతిమ కలిగిన బంగారు, వెండి డాలర్ల ఘటనపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసి దర్యాప్తునకు ఆదేశించామని  యాదగిరిగుట్ట ఆలయ ఈవో, ఐఏఎస్ అధికారి భవానీ శంకర్ తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు .

 గతంలో హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించిన భవానీ శంకర్ ను ప్రభుత్వం ఈ నెల 17న ఆలయ ఈవోగా ట్రాన్స్‌‌‌‌ఫర్  చేసింది. కానీ రాజ్ భవన్ విధుల నుంచి రిలీవ్ కావడం ఆలస్యం కావడంతో.. ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టడంలో జాప్యం జరిగింది. ఈవోగా ఛార్జ్ తీసుకోవడం కోసం ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా చర్యలు 

గురువారం యాదగిరిగుట్టపై ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఆలయంలో డాలర్ల మాయం విషయం తన దృష్టికి వచ్చిందని ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించడమే కాకుండా ఇకపై ఇలాంటివి రిపీట్ కాకుండా ఏ విధమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలో కూడా సూచించాలని కమిటీని ఆదేశించామని పేర్కొన్నారు. కమిటీ రిపోర్ట్ అందాక సంబంధిత వ్యక్తులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

ఈ నెల 26, 27న రూ.10 లక్షల వరకు జమ.?

20 రోజుల క్రితం ప్రచార శాఖ ద్వారా భక్తులకు విక్రయించిన 18 డాలర్లకు సంబంధించిన డబ్బులు ఆలయ ఖాతాలో జమ చేయకుండా ప్రచార శాఖ సిబ్బంది సొంత అవసరాల కోసం వాడుకున్నారని, ఆ డబ్బును ఈ నెల 26, 27 తేదీల్లో తిరిగి ఆలయ ఖాతాలో జమ చేసినట్లు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది.  బంగారు డాలర్ 3 గ్రాములు, వెండి డాలర్ 5 గ్రాములుగా ఉంటుందని, మొత్తం 18 డాలర్లకు సంబంధించిన అమౌంట్ ను ఆలయ ఖాతాలో జమ చేశారని కావాలనే లీకులు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. 

మిస్ అయిన డాలర్ల విలువ దాదాపుగా రూ.10 లక్షలకు పైగా ఉందని, విషయం బయటకు పొక్కడంతో హుటాహుటిన రూ.10 లక్షల అమౌంట్ అలాయ ఖాతాలో జమ చేయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కేవలం18 డాలర్లకు సంబంధించిన డబ్బు మాత్రమే మిస్ యూస్ అయిందని, ఆ అమౌంట్ ను డిపాజిట్ చేపించామని ఆలయ అధికారులు లీకులు ఇస్తున్నారు.