స్వాభిమాన పోరాటాలకు భీమా కోరేగావ్ స్ఫూర్తి

స్వాభిమాన పోరాటాలకు భీమా కోరేగావ్ స్ఫూర్తి

దేశ మూలవాసి ప్రజలను నీచమైన బానిసత్వానికి గురిచేసిన పీష్వా బ్రాహ్మణులపై మహార్ పోరాట యోధులు చేసిన యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్.  మహారాష్ట్ర కోరేగావ్ లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారు. వేల సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచుకోవడానికి ప్రతిన బూనిన 500 మంది మహార్ పోరాట యోధులు 200 మంది బ్రిటీష్ సైన్యంతో కలిసి రెండు వందల కిలోమీటర్లు నడిచి భీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. 20 వేల మంది పదాతిదళం, 8 వేల మంది అశ్విక దళంతో కనుచూపు మేరలో కనిపిస్తున్న పీష్వా సైన్యాన్ని చూసిన బ్రిటిష్ సైన్యం అక్కడి నుండి జారుకుంది. బతికితే పోరాట వీరులుగా బతకాలని లేదంటే హీనమైన బతుకులతో చావాలని నిర్ణయించుకున్న మహార్ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యారు.

తిండిలేక కాలినడకన వచ్చిన మహార్ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని ఉరికించడాన్ని దూరంగా నిలబడి చూసిన బ్రిటీష్ అధికారి లెఫ్టినెంట్​ కల్నల్ ఆశ్చర్యపోయారు. విరామం లేకుండా జరిగిన భీకర యుద్ధంతో భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రబడింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకైన గోవింద్ బాబా తలను 
తెగనరికితే ఆ తల లేని కొడుకు మొండాన్ని చూసి ఏడుస్తూ భయంతో అందరూ పారిపోండంటూ పూల్లావ్ లోని బాజీరావ్ శిబిరం వైపు పీష్వా సైన్యం పారిపోయారు.

స్మారక స్థూపం

అమరులైన 12 మంది మహార్ సైనికులకు స్మృతి చిహ్నంగా బ్రిటిష్ వారు స్మారక స్థూపం కట్టించడమే కాకుండా మహార్ సైనికులతో మహార్ రెజ్మెంట్ ఏర్పాటు చేశారు. 1927 జనవరి 1న ఈ స్మారక స్థూపాన్ని మొట్టమొదటిసారి సందర్శించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ స్థూపాన్ని దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా, ఆత్మగౌరవ ప్రతీకగా పేర్కొన్నారు. అంబేద్కర్ సందర్శించిన నాటి నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది దళిత బహుజనులు జనవరి ఒకటిన భీమా కోరేగావ్ సందర్శనకు వెళతారు. దేశవ్యాప్తంగా దళిత గౌరవం నిలిచి గెలిచిన రోజుగా శౌర్య దివస్​గా జరుపుకొని  కోరేగావ్ వీరులను స్మరించుకుంటారు. 

తారతమ్యాలు పోలేదు

అంటరానితనం చరిత్ర చూస్తే అత్యంత క్రూరమైన అంటరానితనం పీష్వా బ్రాహ్మణ రాజ్యమైన పుణే ప్రాంతంలో జరిగింది. దళితుల నీడ కూడా అగ్రవర్ణాలపై పడకూడదని,  దళితులు పొద్దున, సాయంత్రం అగ్రవర్ణాల వారి ఇండ్లకు కానీ వారి దగ్గరకు కానీ పోగూడదని తన నీడ తనపైన పడే పట్టపగలు మాత్రమే వెళ్లాలనే నిబంధన ఉండేది.  200 సంవత్సరాల క్రితం జరిగిన భీమా  కోరేగావ్ యుద్ధ గాయం ఇంకా మానడంలేదు.  ఇప్పటికీ దళితులు అగ్రవర్ణాల మధ్య తారతమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల క్రితం భీమా  కోరేగావ్​లో జరిగిన అల్లర్లు చూస్తే దళితుల పట్ల అగ్రవర్ణాల అసహనం కనిపిస్తుంది. అలాగే, దళిత, ఆదివాసీ జాతిపై వ్యతిరేకత లేదని దళిత వాడల్లో భోజనాలు చేస్తున్నారు. 

స్వాభిమానాన్ని విస్మరిస్తున్నామా?

మనకు అందని చదువుల కోసం ఆరాటపడుతున్నాం.  మన మీద జరుగుతున్న దాడులను ఆదాయ వనరులుగా, రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటూ స్వాభిమానాన్ని తాకట్టు పెడుతున్న కోవర్టులు, చెంచాగాళ్లు మన శక్తిని నిర్వీర్యం చేస్తున్నా మనం వారికి జేజేలు కొడుతున్నాం. బాబా సాహెబ్ చేసిన త్యాగాల ద్వారా, మెరుగైన ఆర్థిక స్థితిని పొంది, స్వాభిమానంతో కూడిన జీవితం పొందిన ఈనాటి దళిత, గిరిజన సమాజం తమ చరిత్రను తెలుసుకోకుండా శత్రు వ్యవస్థ పన్నిన ఉచ్చులో పడి కేవలం ఆటవిడుపులోనే ఆనందం వెతుక్కుంటూ మన పూర్వీకులు మనకు సాధించి పెట్టిన స్వాభిమానాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారన్నది నిజం కాదా?.

ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలకు, బెంగాల్ నవాబ్ సిరాజుద్దీన్ దౌలా సైన్యాలకు మధ్య 1757లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ దళాలు గెలిచాయి. చరిత్రలో దీనికి ప్లాసి యుద్ధమని పేరు పెట్టారు. చివరి యుద్ధంలో పీష్వా(బ్రాహ్మణ) సామ్రాజ్యం ధ్వంసమై ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యం  స్థాపించబడింది. మధ్యకాలంలో దుసాద్​ల నుంచి మహార్ సైనికుల వరకు అన్ని విజయాలు, మూల భారతీయ సైనికుల సహాయంతోనే సాధ్యమైనాయి.  
– డా. బిఆర్ ​అంబేద్కర్ 

ఓటు యుద్ధం చేయాలి

మన దేశంలో దళిత గౌరవం నిలిచి గెలిచిన భీమా కోరేగావ్ యుద్దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓటు ద్వారా యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆనాడు ప్రత్యక్ష యుద్ధం చేసిన బహుజనులు నేడు ప్రజాస్వామ్య దేశంలో  అంబేద్కర్ కల్పించిన ఓటు ద్వారా తను చూపిన మార్గంతో బహుజన రాజ్యం కోసం దళిత బహుజనులు కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి.  బహుజనుల్లో ఎదిగిన వాళ్లు విలువలతో కూడిన రాజకీయాల నిర్మాణం చేసి భీమా కోరేగావ్ వీరుల స్ఫూర్తితో, పూలే, పెరియార్, అంబేద్కర్ చూపిన మార్గంలో బహుజన రాజ్య నిర్మాణం కోసం కృషి చేయాలి. రండి  కొత్త సంవత్సర వేడుకలు కాదు, గ్రామ గ్రామాన విజయోత్సవ వేడుకలు చేసుకుందాం. జనవరి 1 ని శౌర్య దినోత్సవంగా జరుపుకుని, మన వీరుల గాథలను మన పిల్లలకు వివరిద్దాం.

సాయిని నరేందర్, సోషల్​, పొలిటికల్​ ఎనలిస్ట్​