ట్రావెల్: ఆదిమానవుల ఆర్ట్ గ్యాలరీ.. భీమ్ బెట్కా

ట్రావెల్: ఆదిమానవుల ఆర్ట్ గ్యాలరీ.. భీమ్ బెట్కా

ప్రాచీన మానవుడి అంతరంగ ఆవిష్కరణ భీమ్ బెట్కా. వింధ్య పర్వతాల్లోని ఈ గుహల్లో.. మనుగడ కోసం ఆయుధం పట్టిన ఆదిమానవుడి వేటను చూడొచ్చు. ఆ వేటలో అలసిన మనసు ఆనందం కోసం ఆడిన ఆటలూ చూడొచ్చు. ఆటకు, వేటకూ మధ్య అప్పుడప్పుడూ జరిగిన ఆధిపత్య యుద్ధాలూ చూడొచ్చు. కాలగర్భంలో కలిసిన మనిషిని ఆవిష్కరించే అద్భుత చిత్రాల వరుస భీమ్ బేట్కా. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద మనకు దగ్గర్లోనే ఉంది. ఓసారి చూసొద్దామా?

మధ్యప్రదేశ్ రాష్ట్రం, రేసాన్ జిల్లాలో విస్తరించి ఉన్న వింధ్య పర్వత సాణువుల్లో ఉన్న గుహల్లో ఆదిమానవుడి కథ చెప్పే అద్భుత చిత్రాలున్నాయి. ఏడు పర్వతాలలో పది కిలోమీటర్ల పొడవున ఆది మానవులు నివసించిన గుహలున్నాయి. ఇక్కడ ఆదిమానవులు సుమారు లక్ష సంవత్సరాల క్రితం ఆవాసంగా ఎంచుకున్నట్లుగా గుర్తించారు. ఈ ఆవాసాల్లో అన్నిచోట్లా దొరికినట్లే ఆయుధాలే కాదు ఆ వేట విశేషాలు తెలిపే ఆధారాలున్నాయి. వేటతోపాటు యుద్ధం దాకా నడిచిన మనిషి కథ ఇక్కడ కనిపిస్తుంది. కొత్త రాతి యుగం నాటి కుడ్య చిత్రాలు చూస్తుంటే ఆదిమానవుడు తన కథను తానే మనతో చెబుతున్నట్లే ఉంటుంది. భారత దేశంలో పురావస్తు పరిశోధకులు వేల ప్రదేశాల్లో ప్రాచీన మానవుడు చిత్రించిన కుడ్య చిత్రాలను గుర్తించారు. వాటన్నింటిలోకీ అత్యంత ప్రాచీనమైనవి భీమ్ బెట్కా గుహలలోని కుడ్య చిత్రాలే. ఇవి 30 వేల సంవత్సరాల నాటివని అంచనా. ఈ గుహలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణలో ఉన్నాయి. వీటిని ప్రపంచ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.

ఆదిమ యుద్ధాలు

ఈ అద్భుత చిత్రాల్లోని ఆదిమానవులు కలిసి ఆనందంగా నృత్యం చేయడం కనిపిస్తుంది. ఆ ఆటలో అందరూ కలిసి ఓ జట్టుగా ఏర్పడటం మరో విశేషం. వివిధ రకాల ఆయుధాలను ధరించిన ఆదిమానవులు సమూహాలుగా ఏర్పడి యుద్ధాలు చేయడం చూడొచ్చు. ఆ యుద్ధాల్లోనే జంతువులను కూడా ఉపయోగించుకున్నారు. యుద్ధ ప్రయాణంలో వాయిద్యాలను మోగిస్తూ ప్రయాణం చేయడం కూడా నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీ చేసే నాయకుడిని అనుసరిస్తూ సాయుధులు, వాయిద్యాలు మ్రోగించేవాళ్లు అనుసరించడం ఈ చిత్రాల్లో కనిపిస్తుంది. ఆదిమానవుడు మచ్చిక చేసుకున్న, వేటాడిన జంతువులు. తనకు తారసపడిన అందమైన జంతువులను ఈ చిత్రాల్లో చిత్రించారు. ఆయుధ ధారణ, ఆటపాటలు, ఆహార్యం మొదలైన సాంస్కృతిక విశేషాలు ఈ చిత్రాల్లో ఉన్నాయి. రాజరిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత అశ్విక, గజ బలాలను ఏర్పరచుకున్న రాజ్యాలు తల పడినపుడు జరిగిన పోరాటాలను పురాణాలు వర్ణించిన యుద్ధ తంత్రాన్ని పోలిన కుడ్య చిత్రాలను కూడా భీమ్ బెట్కాలో చూడొచ్చు.

• భీమ్ బెట్కా అంటే భీముడు కూర్చున్న ప్రదేశం అని అర్థమట. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ పేరు వెనుక ఉన్న గాథలు మహా భారతంలో ఉన్నాయి.
• భీమ్ బెట్కా గుహలను 1957లో వీఎస్ వాకాంకర్ అనే పరిశోధకుడు కనుగొన్నాడు.
• భోపాల్ విమానాశ్రయం నుంచి భీమ్ బెట్కాకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి భోపాల్కు రైలు సదుపాయం ఉంది.

హజరత్ దర్గా

మన దేశంలో జరిగే ప్రముఖమైన ఉర్సు ఉత్సవాలలో హజరత్ పీర్ ఫతేహుల్లా షా బాబా ఉర్సు ఉత్సవం ఒకటి. ఈ ఉర్సు ఉత్సవాలు రేసాన్ పట్టణంలో ఉన్న హజరత్ పీర్ ఫతేహుల్లా షా దర్గాలో జరుగుతాయి. ఈ ఉత్సవాలకు మధ్యప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుంచి ముస్లింలు తరలివస్తారు.

రేసాన్ ఫోర్ట్

రేసాన్ జిల్లా కేంద్రంలో అందమైన కోట ఒకటి ఉంది. భీమ్ బెట్కా పోయినప్పుడు రేసాన్ ఫోర్ట్ కూడా చూసిరండి. ఇసుక రాతిని అందమైన వాస్తుశిల్పంగా మలచిన కోట ఇది. ఎత్తయిన కొండపై విశాలమైన ఈ కోటలో అద్భుతాలు ఎన్నో! అందమైన దర్బారు. దానికి ఎదురుగా విశాలమైన కోనేరు. దాని చుట్టూ ఆలయాలు... ఇక్కడ రోజంతా కాలక్షేపం చేయొచ్చు. మధ్య ప్రదేశ్కు రక్షణ ద్వారాలుగా వర్ణించే ప్రసిద్ధమైన కోటలలో ఇది ఒకటి.