శ్రీశైలంలో సాంప్రదాయబద్ధంగా భోగిమంటలు

శ్రీశైలంలో సాంప్రదాయబద్ధంగా భోగిమంటలు

కర్నూలు జిల్లాలో భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భోగిని పురస్కరించుకుని జిల్లా వాసులు తమ ఇళ్ల ముందు మంటలు వేశారు. కాగా శ్రీశైలంలో సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవాలయంలో వేకువ జామున భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. సాంప్రదాయబద్దంగా పిడకలు, ఎండుగడ్డి, వంటచేరుకుని వేసి భోగి మంటలు వేశారు.  

శ్రీస్వామి అమ్మవార్లకు ప్రాత:కాలపూజలు, మహా మంగళహారతులు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా భోగిమంటలు వేశారు. ప్రధాన ఆలయ మహాద్వారం ముందు గంగాధర మండపం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా అర్చకులు, వేద పండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ.. సంకల్పాన్ని పఠించారు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా కర్రలు వేసి.. భోగిమంటలు వెలిగించారు.

సంక్రాంతి సందర్భంగా వేసే భోగి మంటలకు మన సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉందన్నారు ఆలయ ఈవో పెద్దిరాజు. భోగిమంటలు వేయడం వల్ల దుష్టపీడలు విరగడై, సకల శుభాలు కలుగుతాయని.. మన సంస్కృతి, సంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే భావనతో భోగిమంటల కార్యక్రము నిర్వహించామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.