భూభారతితో రైతులకు ఎంతో మేలు :చామల కిరణ్ కుమార్ రెడ్డ

భూభారతితో రైతులకు ఎంతో మేలు :చామల కిరణ్ కుమార్ రెడ్డ

శాలిగౌరారం (నకిరేకల్), యాదగిరిగుట్ట, రామన్నపేట, వెలుగు :  భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,  ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం అన్నారు. మంగళవారం శాలిగౌరారం (నకిరేకల్), యాదగిరిగుట్ట, రామన్నపేట మండలాల్లో వేర్వేరుగా జరిగిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. గతంలో ధరణిలో సమస్యలు పరిష్కరించేందుకు అధికారులకు కూడా అవకాశం ఉండేది కాదని, భూభారతిలో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. 

80 శాతం భూ సమస్యలు తహసీల్దార్ వద్దనే పరిష్కారమవుతాయన్నారు. ధరణిలో కొంతమంది మాత్రమే లబ్ధిపొందారని, తమ ప్రభుత్వం భూసమస్యలకు పరిష్కారం కల్పించే విధంగా చట్టం తీసుకువచ్చిందన్నారు. దీనిని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూభారతితో రైతులకు తమ భూమిపై యాజమాన్య హక్కులు లభిస్తాయని, భూసమస్యలు పరిష్కారం అవ్వడమే కాకుండా భూమి ఉన్న ప్రతి రైతుకు భూధార్ కార్డులు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.