రాజుకు బర్త్ డే గిఫ్ట్‌గా.. వీధి కుక్కల్ని దత్తత తీసుకోండి: ప్రజల్ని కోరిన ప్రధాని

రాజుకు బర్త్ డే గిఫ్ట్‌గా.. వీధి కుక్కల్ని దత్తత తీసుకోండి: ప్రజల్ని కోరిన ప్రధాని

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్గేల్ వాంగ్‌చుక్ శుక్రవారం 40వ బర్త్ డే జరుపుకున్నారు. ఆయనకు పుట్టిన రోజు గిఫ్ట్‌గా మొక్కలు నాటడంతో పాటు వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని ప్రజలను కోరారు ఆ దేశ ప్రధాని లోటే ట్సేరింగ్.

వాంగ్ చుక్ జన్మదిన వేడుకలను భూటాన్‌లోని ఓ స్టేడియంలో ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ దేశ ప్రధాని లోటే ట్సేరింగ్. రాజు బర్త్ డే సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం, విద్య రంగాల్లో సంక్షేమ పథకాలను ప్రకటించారు ప్రధానమంత్రి. అలాగే ఆర్థిక, టెక్నాలజీ రంగాల్లో ఈ ఏడాది తీసుకురాబోయే కొత్త విధానాల గురించి వివరించారు. అలాగే రాజు బర్త్ డే సందర్భంగా ప్రజలు వ్యక్తిగతంగా కొన్ని మంచి పనులు చేయాలని కోరారాయన. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాన్ని పెంచాలని, అలాగే వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని అడిగారు. చెత్తను ఎక్కడంటే అక్కడ పడేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ పనులు చేస్తే రాజుకు గొప్ప గిఫ్ట్ ఇచ్చినట్లేనని చెప్పారు భూటాన్ ప్రధాని. ఈ విషయాన్ని ఆ దేశ పీఎంవో ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేసింది.

Nation celebrates the auspicious day and in Thimphu, all wishes, festivity, music and colours converged at…

Posted by Prime Minister's Office – PMO, Bhutan on Thursday, February 20, 2020

కాగా, భూటాన్‌లో కుక్కల సంఖ్య భారీగా ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఆ దేశంలో డాగ్ పాపులేషన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వీధి కుక్కులను ప్రజలకు దత్తత ఇచ్చే స్కీమ్‌ను తెస్తున్నట్లు గత నెలలోనే ప్రకటించింది.