మరోసారి ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన జో బైడెన్

మరోసారి ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన జో బైడెన్

వాషింగ్టన్‌ : అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) మరోసారి ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయారు. జర్నలిస్టులు ఒకవైపు ప్రశ్నలు సంధిస్తుంటే..అవేమీ తనకు కాదన్నట్టు వెనక్కి తిరిగి చూడకుండా ప్రెస్ మీట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. 

అమెరికా(USA)లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకుల్లో సంక్షోభం తలెత్తింది. బ్యాంకులను మూసివేసిన తర్వాత  తన నియంత్రణలోకి తీసుకున్నట్లు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  స్పష్టం చేసింది. వీటి గురించి బైడెన్‌ (Joe Biden) మాట్లాడుతూ.. తమ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. డిపాజిటర్ల డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగారు. 

సంక్షోభం ఎందుకు తలెత్తిందనే దానిపై మీ వద్ద (బైడెన్) ప్రస్తుతం ఉన్న సమాచారం ఏంటి..? దీని తర్వాత పరిణామాలు ఉండవని మీరు అమెరికన్లకు భరోసా ఇవ్వగలరా..? అని మీడియా ప్రతినిధులు బైడెన్ ను పశ్నించారు. ఇది విన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అధ్యక్షుడు బయటకు వెళ్లారు.

‘మరికొన్ని బ్యాంకులకు ఇలాంటి పరిస్థితే తలెత్తుందా..?’ అని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఇదంతా తనకు సంబంధించిన విషయం కాదన్నట్టు వెనక్కి చూడకుండా బైడన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రెస్ మీట్ జరుగుతున్న గది తలుపు వేసి, బయటకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన విజువల్స్.. వైట్ హౌస్ కు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో వైరల్ గా మారాయి. బైడెన్ ప్రెస్ మీట్ నుంచి బయటకు వెళ్తున్న విజువల్స్ ను దాదాపు నాలుగు మిలియన్ల మందికిపైగా వీక్షించారు. అంతేకాదు...వైట్ హౌస్ సిబ్బంది యూట్యూబ్ కామెంట్స్ ను ఆఫ్ చేశారు. బైడెన్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

గతంలోనూ మధ్యలోనే వెళ్లిన బైడెన్ 

ప్రెస్ మీట్ నుంచి బైడెన్ మధ్యలో వెళ్లిపోవడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. ఈ మధ్య చైనా నిఘా బెలూన్‌ ఘటనపై జరిగిన సమావేశంలోనూ ఇలానే మధ్యలోనే వెళ్లిపోయారు. ‘చైనా(China)లో ఉన్న మీ కుటుంబ వ్యాపారాల వల్ల దేశ భద్రత విషయంలో మీరు రాజీపడ్డారా..?’ అనే ప్రశ్న ఎదురుకాగా.. ‘నాకు కొంచెం బ్రేక్‌ ఇవ్వండి’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.