చిన్న నగరాలపై పెద్ద బ్రాండ్ల ఫోకస్..3 రెట్లు పెరిగిన గ్రేడ్ A మాల్స్

చిన్న నగరాలపై పెద్ద బ్రాండ్ల ఫోకస్..3 రెట్లు పెరిగిన గ్రేడ్ A మాల్స్
  • మెట్రోల్లో అద్దెలు పెరగడం, ప్రైమ్ లొకేషన్లలో ల్యాండ్ దొరకకపోవడమే కారణం
  • టైర్ 2  సిటీల్లో 3.6 కోట్ల చదరపు అడుగులకు  చేరిన మొత్తం రిటైల్ స్పేస్‌‌‌‌‌‌‌‌
  • 2020 తర్వాత ఏకంగా 59 లక్షల చదరపు అడుగుల జోడింపు 
  • నైట్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌– సీఐఐ రిపోర్ట్ వెల్లడి

న్యూఢిల్లీ :  పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్ల స్టోర్లు  మెట్రోలను దాటి చిన్న నగరాల  వైపు చూస్తున్నాయి. కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు.   వరంగల్, విశాఖపట్నం వంటి  టైర్-2 నగరాల వైపు కూడా వేగంగా అడుగులేస్తున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చూస్తే,  టైర్-1 నగరాలతో పోలిస్తే టైర్-2 నగరాల్లో ఏకంగా మూడు రెట్లకు పైగా గ్రేడ్–-ఏ షాపింగ్ మాల్స్ స్థలం అందుబాటులోకి వచ్చిందని  రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) విడుదల చేసిన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. 

దీని ప్రకారం, 2020 తర్వాత టైర్-2 నగరాల్లో కొత్తగా 59 లక్షల చదరపు అడుగుల మేర గ్రేడ్ –ఏ  రిటైల్ ‌‌‌‌‌‌‌‌ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో మెట్రో నగరాల్లో కేవలం 19 లక్షల చదరపు అడుగులు మాత్రమే ఏర్పాటైంది.  కానీ, మొత్తం రిటైల్ స్పేస్‌‌‌‌‌‌‌‌లో టైర్ 1 సిటీలు ముందున్నాయి. ఈ సిటీల్లో రిటైల్ స్పేస్  ఏకంగా 9.8 కోట్ల చదరపు అడుగులకు చేరింది.   టైర్-2 నగరాల్లో ఇది 3.6 కోట్లుగా నమోదైంది.  కానీ, క్వాలిటీ పరంగా చూస్తే చిన్న సిటీల్లోనే గ్రేడ్ ఏ రిటైల్ స్పేస్‌‌‌‌‌‌‌‌ వాటా ఎక్కువగా ఉంది. టైర్ 2 సిటీల్లోని మొత్తం రిటైల్ స్పేస్‌‌‌‌‌‌‌‌లో   61 శాతం గ్రేడ్- ఏ కేటగిరీ కాగా,  టైర్ 1 సిటీల్లో ఇది 46 శాతంగా ఉంది.  టాప్‌‌‌‌‌‌‌‌  క్వాలిటీ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌ ఉన్న రిటైల్ స్పేస్‌‌‌‌‌‌‌‌  గ్రేడ్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది.   

మెట్రో నగరాల్లో అద్దెల భారం

పెద్ద నగరాల్లో మాల్స్‌‌‌‌‌‌‌‌, స్టోర్లకు కొరత లేకపోయినా, మంచి లొకేషన్లలో ఖాళీ స్థలాలు దొరకడం లేదు. అద్దెలు ఆకాశాన్నంటుతుండటంతో కొత్త స్టోర్లను  ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయడం రిటైల్ సంస్థలకు  భారంగా మారుతోంది. మరోవైపు  అమెజాన్, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ వంటి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్ ద్వారా చిన్న నగరాల్లోని ప్రజలు ఇప్పటికే పెద్ద బ్రాండ్ల ఉత్పత్తులకు అలవాటు పడ్డారు. దీంతో చిన్న సిటీల్లో స్టోర్లు ఓపెన్ చేసినా,  వినియోగదారులు వస్తున్నారు.  

 భారత్‌‌‌‌‌‌‌‌లోని 41 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారుల్లో 60 నుంచి 70 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉండటం  గమనార్హం.  ప్రస్తుతం 24 ప్రధాన టైర్-2 నగరాల్లో 37 దేశాలకు చెందిన 255 అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించి ఏకంగా 1,720 స్టోర్లు నడుస్తున్నాయి. చిన్న పట్టణాల ప్రజల జీవనశైలి, కొనుగోలు ఆకాంక్షలు మెట్రోలకు ఏమాత్రం తీసిపోవడం లేదని నైట్​ఫ్రాంక్​ రిపోర్ట్​ తెలిపింది. 

మెట్రోలకు ప్రత్యామ్నాయం కాదు.. 

షాపింగ్ మాల్స్, రిటైల్ స్టోర్లు   పెద్ద నగరాలను వదిలేయడం లేదు. తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను విస్తరిస్తున్నాయంతే.   “మా మొత్తం ఆదాయంలో ఇంకా 80 శాతానికి పైగా మెట్రో నగరాల నుంచే వస్తోంది. అక్కడ వ్యాపారం కొనసాగుతూనే ఉంది.  కానీ కొత్త స్టోర్లను తెరిచేందుకు అనువైన స్థలాలు సరసమైన అద్దెకు దొరకడం లేదు.దీంతో టైర్-2 నగరాల్లో విస్తరిస్తున్నాం’’అని లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్ సీఈఓ దేవరాజన్  తెలిపారు.