ఐటీ ఉద్యోగుల మెడపై కత్తి : గంటకు 23 మంది తొలగింపు

ఐటీ ఉద్యోగుల మెడపై కత్తి : గంటకు 23 మంది తొలగింపు

ఐటీ ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. రేపటికి ఉద్యోగం ఉంది అంటే.. హమ్మయ్య అని ఫీలయ్యే పరిస్థితి ఐటీ ఉద్యోగుల్లో ఉంది. దీనికి కారణం లేకపోలేదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంక్షోభం క్రమంలో.. చిన్నా పెద్దా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రాజెక్టులు తక్కువగా ఉండటం.. కొత్త ప్రాజెక్టులు రాకపోవటంతో.. ఉద్యోగులను తొలగించి ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి గంటకు.. ప్రపంచ వ్యాప్తంగా 23 మంది ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి కంపెనీలు. ఐటీ కంపెనీలకు చిన్న విషయంగా కనిపించినా.. ఉద్యోగులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెను సవాల్ గా మారింది. గంటకు 23 మంది ఉద్యోగులు అంటే.. ఆషామాషీ కాదు.. 24 గంటల్లో 552 మంది.. అంటే నెలకు 30 రోజుల్లో 16 వేల 560 మంది ఐటీ ఉద్యోగులు.. తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.. ఇది రెండేళ్లుగా సాగుతుందని ఓ సర్వే బయటకు రావటం.. ఐటీ రంగంలోని సంక్షోభాన్ని ఎత్తి చూపుతుంది..

ఆర్థిక మాంధ్యం పేరుతో ఇప్పటికే అనేక దిగ్గజ ఐటీ సంస్థలు, స్టార్టప్ లు, ఇతర టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా కంపెనీల్లో తొలగింపులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. టెక్ సెక్టార్ ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ layoff.fyi తాజా డేటా ప్రకారం.. 2వేల 120 టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 4 లక్షల 4 వేల 962 మంది ఉద్యోగులను తొలగించాయి.

2022లో వెయ్యి 61 టెక్ కంపెనీలు లక్షా 64 వేల 769 మంది ఉద్యోగులను తొలగించగా.. 2023లో వెయ్యి 59 కంపెనీలు ఇప్పటి వరకు (అక్టోబర్ 13వరకు) 2 లక్షల 40 వేల 193 మంది ఉద్యోగులను తీసివేశాయి. సగటున.. గత రెండేళ్లలో రోజుకు 555 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అంటే ఇది ప్రతి గంటకు 23 మంది ఉద్యోగులతో సమానమన్నమాట. 2023, ఒక్క జనవరి నెలలోనే 89వేల 554 మంది ఉద్యోగులను తొలగించడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సంఖ్య ప్రస్తుతంతో పోలిస్తే కాస్త తగ్గినా... తొలగింపులు యథాతథంగా కొనసాగుతున్నాయి.

ఐటీ సెక్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. రిటైల్ టెక్ అండ్ కన్య్సూమర్ టెక్.. ఈ ఏడాది భారీ మొత్తంలో ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ఈ కంపెనీలను వరుసగా 29వేల 161మంది, 28వేల 873మంది ఉద్యోగులు గత రెండేళ్లలో ఉద్యోగులను తీసివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇవే కాదు చైనాలిసిస్, ఫ్లెక్స్, సిస్కో, పై ఇన్సూరెన్స్ వంటి పలు యూఎస్ బేస్డ్ కంపెనీలు సైతం.. ఇటీవలి కాలంలో వందలాది మంది ఉద్యోగులను వదిలించుకున్నాయి. గత నెలలో.. అంటే 2023 సెప్టెంబర్ నెలలో ఫోర్ట్ నైట్ గేమ్ డెవలపర్ ఎపిక్ గేమ్స్ తన ఉద్యోగుల్లో 16 శాతం మందిని తొలగించింది. ఇది 870మందిపై ప్రభావం చూపింది.