త్వరలో కొత్త చట్టం.. టేక్ హోం శాలరీలో భారీ మార్పులు

V6 Velugu Posted on Jul 30, 2021

ఉద్యోగల టేక్ హోం శాలరీ త్వరలో భారీగా మార్పులు రానున్నాయి. బేసిక్ శాలరీ నుంచి సగం శాలరీ పీఎఫ్ కటింగ్‌లో జమకానుంది. దాంతో పీఎఫ్ కటింగ్ పెరగనుంది. దీనికి సంబంధించిన చట్టాలను కేంద్రం త్వరలోనే అమలులోకి తీసుకురానుంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో లేబర్ కోడ్ నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ చట్టం అమలులోకి వస్తే ఉద్యోగుల టేక్ హోమ్ జీతంలో మార్పులు వస్తాయి. కాగా.. ప్రావిడెంట్ ఫండ్‌లో ఎక్కువ డబ్బు జమ కానుంది. 

కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక చట్టాలను వీలైనంత త్వరలో అమలు చేయాలనుకుంటోంది. ముందుగా జూలై 1 నుంచి లేబర్ కోడ్ నియమాలను అమలు చేయడానికి సిద్ధమైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సిద్ధంగా లేవు. కేంద్రం మరియు రాష్ట్రాలు ఈ నాలుగు చట్టాలను ముందస్తుగా ఉద్యోగులకు మరియు కంపెనీలకు తెలియజేయాలి. ఆ తర్వాతే ఈ చట్టాలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ కార్మిక చట్టాల అమలు తరువాత జీతాల విషయంలో చాలా మార్పులు ఉండబోతున్నాయి.

కొత్త చట్టంతో బేసిక్ శాలరీ మరియు పీఎఫ్ విషయంలో గణనీయమైన మార్పు ఉంటుంది. పారిశ్రామిక సంబంధాలు, వేతనాలు, సామాజిక భద్రత, వృత్తి మరియు ఆరోగ్య భద్రత మరియు ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయడానికి కార్మిక మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ఈ చట్టాల మార్పు తరువాత ఉద్యోగుల కనీస వేతనం రూ .15,000 నుంచి రూ .21,000 వరకు పెరుగుతుంది. ఉద్యోగుల కనీస వేతనం రూ .15,000 నుండి రూ .21,000కి పెంచాలని కార్మిక సంఘాలు ఎంతకాలంగానో డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ చట్టాలు అమలైతే ఉద్యోగుల జీతాలు కూడా పెరిగే అవకాశముంది. కొత్త వేతన నియమావళి ప్రకారం.. అలవెన్సులు 50 శాతానికి మాత్రమే పరిమితం చేయబడతాయి. అంటే ఉద్యోగుల మొత్తం జీతంలో 50 శాతం కనీస వేతనం అవుతుంది. దాంతో పీఎఫ్ కటింగ్ బేసిక్ శాలరీ ఆధారంగా ఉంటుంది. 

ప్రస్తుతం కంపెనీలు ఉద్యోగుల జీతాన్ని అనేక రకాల అలవెన్సులుగా విభజిస్తారు. దాంతో ఉద్యోగి బేసిక్ శాలరీ తక్కువగా ఉంటుంది. తద్వారా పీఎఫ్ కటింగ్ మరియు ఇన్‌కంటాక్స్ పేమెంట్ తగ్గుతుంది. కొత్త వేతన కోడ్‌‌ను అనుసరించి.. పీఎఫ్ కటింగ్ అనేది మొత్తం జీతం నుంచి 50 శాతం చొప్పున కట్ అవుతుంది. 

ఈ కొత్త చట్టాలతో ప్రయోజనం ఏంటి?
చట్టాల అమలు తర్వాత బేసిక్ శాలరీ 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. బేసిక్ శాలరీ ఆధారంగా పీఎఫ్ కటింగ్ ఉంటుంది. అప్పుడు పీఎఫ్ జమలో కంపెనీ మరియు ఉద్యోగి భాగస్వామ్యం పెరుగుతుంది. దాంతో పీఎఫ్‌తో పాటు గ్రాట్యుటీ కూడా పెరిగి.. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి తీసుకునే మొత్తం కూడా పెరుగుతుంది. పీఎఫ్‌లో ఉద్యోగుల భాగస్వామ్యం పెంచడం వలన కంపెనీలపై ఆర్థిక భారం పెరుగుతుంది. అంతేకాకుండా.. బేసిక్ శాలరీ పెరగడం వల్ల గ్రాట్యుటీ మొత్తం కూడా మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది. అది గతంలో కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉంటుంది. వీటన్నింటి వల్ల ప్రైవేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది.

Tagged India, Employees, Salaries, companies, PF, Basic salary, labor code, labor laws, gratuity

Latest Videos

Subscribe Now

More News