RCB: మార్చి 28 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2026 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగబోతుంది. ఆ టోర్నీ ప్రారంభానికి ముందే ఆర్సీబీకి సంబంధించిన ఒక ఆందోళన కలిగించే న్యూస్ బయటకు వచ్చింది. ఆ జట్టు స్టార్ పేసర్ జాష్ హేజిల్‌వుడ్ ఇంకా పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తుంది.
ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవాలనే కోరికతో బరిలోకి దిగిన ఆర్సీబీ 2025లో చివరికి దాన్ని కైవసం చేసుకుంది. ఆ విజయంలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జోష్ నిలిచాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటర్లను ఇబ్బంది పెట్టి మ్యాచ్ ని తమ వైపుకు మార్చడంలో కీలకంగా వ్యవహరించాడు.
గాయపడిన హేజిల్‌వుడ్ ప్రతిష్టాత్మకమైన ది యాషెస్ సిరీస్‌తో పాటు భారత్‌లో జరిగిన టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ప్రస్తుతం ఫిజియో పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో జోష్ ఐపీఎల్ 2026లో ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం సందేహంగా మారింది. అయితే మార్చి 28వ తేదీలోపు అతడు పూర్తిగా ఫిట్ అయ్యే ఛాన్సులు 50– -50గా ఉన్నాయని టాక్. ఒకవేళ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ కి దూరమైతే.. ఆర్సీబీకి బిగ్ షాకే అని చెప్పాలి.
