
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్నియోజకవర్గంలో టీఆర్ఎస్పార్టీకి షాక్తగిలింది. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒంటెత్తు పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భీమారం మండలానికి చెందిన కీలక నేత చెరుకు సరోత్తంరెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎంపీపీ, జడ్పీటీసీ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు మరికొందరు నాయకులతో కలిసి కారు దిగేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గానికి చెందిన మరికొందరు అసంతృప్త నేతలు సైతం సరోత్తంరెడ్డి బాటలోనే నడిచేందుకు రెడీ అవుతున్నారు. దీంతో టీఆర్ఎస్పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది.
ముదురుతున్న విభేదాలు
ఎమ్మెల్యే బాల్క సుమన్వ్యవహార శైలిపై నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు,ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్హైకమాండ్వద్ద సుమన్‌కు ఉన్న పలుకుబడితో నియోజకవర్గంలోని సీనియర్లీడర్లను పథకం ప్రకారం రాజకీయంగా అణగదొక్కుతూ సొంత కోటరీ నిర్మించుకుంటున్నాడనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సుమన్‌పై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌పార్టీలో చేరారు. కోటపల్లి మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, సుమన్మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. సతీశ్‌కు రెండోసారి ఎమ్మెల్సీ పదవి రాకుండా సుమన్అడ్డుకున్నారని ఆయన అనుచరులు గుర్రుగా ఉన్నారు. అలాగే జడ్పీ మాజీ వైస్చైర్మన్మూల రాజిరెడ్డితోనూ విభేదాలు ఉన్నాయి. ఇక చెరుకు సరోత్తంరెడ్డికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. 2014లో ఎంపీగా, 2018లో ఎమ్మెల్యేగా సుమన్గెలుపు కోసం శక్తివంచన లేకుండా పాటుపడితే తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
అవమానాలు తట్టుకోలేకే..
రెండు మూడు రోజుల్లో జిల్లా స్థాయిలో 20వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజీనామాలు ప్రకటిస్తామని చెరుకు సరోత్తంరెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన భీమారంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపై ఫైర్ అయ్యారు. తన కుమార్తె ఎంపీపీ చెరుకు దీపికారెడ్డి, జడ్పీటీసీ భూక్య తిరుమల, నర్సింగాపూర్ ఎంపీటీసీ పెద్దల రూప, బూరుగుపల్లి, నర్సింగాపూర్, కొత్తపల్లి, కాజీపల్లి, ఆరెపల్లి, ధర్మారం సర్పంచులు చెడంక లక్ష్మి, దుర్గం మల్లేశ్, గోదారి తిరుపతి, అనపర్తి సునీత, దాడి తిరుపతి, వడ్లకొండ రమాదేవి, మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్, కో ఆప్షన్ మెంబర్ బాబర్‌ఖాన్ టీఆర్ఎస్ను వీడనున్నట్టు తెలిపారు. పార్టీలో తమకు జరిగిన అవమానాలు తట్టులేకనే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. బాల్క సుమన్ ఒంటెద్దు పోకడలపై నియోజకవర్గంలోని చాలామంది నాయకులు అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఏ పార్టీలో చేరకుండా భారతి భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు సేవలందిస్తామని పేర్కొన్నారు.
ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, లీడర్లు, కార్యకర్తలు గ్రామాల్లోని సమస్యలను చెప్పుకోవడానికి చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు వెళ్తే లోపలికి అనుమతించడం లేదని సరోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో, మండలంలో ఏ మీటింగ్ పెట్టినా ఎమ్మెల్యే పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు. అధికారులను చేతిలో పెట్టుకొని మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబాల భూములను దౌర్జన్యంగా గుంజుకున్నారని తెలిపారు. కేసులు పెడుతామని బెదిరించి ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించడం బాధాకరమని అన్నారు. భీమారం మండలం ఏర్పడి ఆరేండ్లు గడుస్తున్నా ప్రభుత్వ ఆఫీసులు నిర్మించలేదని, తమ సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీ బిల్డింగ్, పశువైద్యశాల నిర్మించామని చెప్పారు. సుమన్ తన తీరును మార్చుకోకపోతే నియోజకవర్గంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.