కుమురం భీం జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్

కుమురం భీం జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్

కుమురంభీం జిల్లా: బెజ్జూర్‌ మండల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు బెజ్జూర్‌ జడ్పీటీసీ సభ్యులు పుష్పలత, కుష్నెపల్లి ఎంపీటీసీ సభ్యులు సాయన్న, ముగ్గురు సర్పంచ్ లు, ఓ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెల్లడించారు. ఈమేరకు వారు ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. మండలంలో రోడ్లు, వంతెనలు లేక జనం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా సౌకర్యాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ సర్కారు నిలుపుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమీపంలో సరైన వైద్య సౌకర్యాలు లేక.. ఏటా ఇద్దరు, ముగ్గురు గర్భిణులు రోడ్లపై ప్రసవిస్తున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఈనెల 9 నుంచి నేటి వరకు జలదిగ్భందంలో ఉండటంతో బెజ్జూరు మండలంలోని  పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని గుర్తుచేశారు.  కాగా, బెజ్జూర్‌ మండలంలోని తలాయి గ్రామం వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో తలాయి,తిక్కపల్లి, భీమారం గ్రామాలు మూడు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.