బిగ్ బాస్.. మొదటి కెప్టెన్ గా బాలాదిత్య

బిగ్ బాస్.. మొదటి కెప్టెన్ గా బాలాదిత్య

కోపాన్ని కెమెరాలు ఆపగలవా? అంతమందున్నా ఆవేశాన్ని అడ్డుకోగలరా? అందుకే వారమంతా చిటపటలతో గడిచిపోయింది. చివరికి శుక్రవారం కూడా బిగ్‌బాస్ హౌస్‌ భగ్గుమంది. రకరకాల కారణాలతో కంటెస్టెంట్ల మధ్య నిప్పు రాజుకుంది. 

కెప్టెన్సీ పోరు..
ఇంటికి మొదటి కెప్టెన్ ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీకి ఇప్పటికి తెర పడింది. శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిన కెప్టెన్సీ పోరులో విజయం బాలాదిత్యని వరించింది. పోటీదారుల కోసం కొన్ని కారు బొమ్మలు రెడీ చేశారు. వాటికి నంబర్ ప్లేట్స్ లేవు. అక్కడ వరుసగా అమర్చిన బాక్సుల్లో నంబర్లు పెట్టారు. వాటి తాళాలను నీళ్లు నిండిన తొట్లలో పడేశారు. పోటీదారులు చేతులు వాడకుండా నోటితో తాళాలు తీసుకుని, పెట్టెలు తెరిచి తమ కారు నంబర్ చూసుకోవాలి. అది గుర్తు పెట్టుకుని వెళ్లి బాల్స్‌ నిండిన తొట్టెలో ఉన్న నంబర్లు, అక్షరాలు వెతికి తీసుకుని వెళ్లి తమ కార్లకి అమర్చాలి. అయితే ఒక్కసారి ఒక్క అక్షరమో నంబరో మాత్రమే పెట్టాలి. అలా ఎవరి నంబర్ ప్లేట్ ముందు పూర్తయితే వాళ్లే విజేత. గీతూ ముందుగా తన ప్లేట్‌ని అమర్చేసింది. అయితే కంగారులో తప్పుగా పెట్టింది. దాంతో తర్వాతి స్థానంలో నిలిచిన బాలాదిత్యకి కెప్టెన్సీ దక్కింది.

గీతూ రాయల్ మారని తీరు..
ఎంతమంది ఎన్ని చెబుతున్నా గీతూ రాయల్ తీరు మారడం లేదు. అంతే నిర్లక్ష్యంగా, యారొగెంట్‌గా బిహేవ్ చేసి అందరికీ కోపం తెప్పిస్తోంది. వాసంతి, బాలాదిత్య, గీతూ ఒకచోట కూర్చున్నారు. అప్పుడు గీతూ కాలు మీద కాలు వేసుకుని ఊపుతోంది. ఆ కాలు బాలాదిత్య ముఖం వరకు వెళ్తోంది. కాసేపు ఓపిగ్గా భరించిన బాలాదిత్య తర్వాత ఆమెని వ్యతిరేకించాడు. నువ్వలా చేస్తే నాకు ఇబ్బందిగా ఉంది, నా ముఖం మీద పెట్టి ఊపుతున్నావ్ అంటే దానికి కూడా గీతూ నాకిది అలవాటు, నేను కుదురుగా ఉండలేను అని సమర్థించుకుంది. ముందు నువ్వు సరిగ్గా కూర్చో, ఎందుకలా చేస్తావ్ అంటూ సరిచేసే ప్రయత్నం చేశాడు బాలాదిత్య. దాంతో సారీ అనేసి మరో కాలు ఊపడం మొదలుపెట్టింది. కానీ కాసేపటికి మళ్లీ బాలాదిత్య వైపుకే కాలు పెట్టడంతో అతను మరోసారి హెచ్చరించాడు. కెప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు కూడా రూల్స్ కు వ్యతిరేకంగా ఆడింది. దాన్ని మెరీనా క్వశ్చన్ చేసింది. అప్పుడు కూడా గీతూ ఫైర్ అయ్యింది. అది నా స్ట్రాటజీ, నేను ఎలాగైనా ఆడతా అంది. అలా మాట్లాడ్డం తప్పు, అదే తాళం నీ టీషర్టులో వేసుకున్నావనుకో, మగాళ్లు చేయి పెట్టి తీస్తే ఏంటి పరిస్థితి అంది మెరీనా. అలా చేసినా నాకేం అభ్యంతరం లేదు, ఇది గేమ్ కాబట్టి ఏదైనా నాకు ఓకే, నేను గెలవడానికే వచ్చా, ఇలాగే ఆడతా అనడంతో అందరూ షాకయ్యారు. ఈ ఎఫెక్ట్ తర్వాత భారీగానే పడింది గీతూ మీద. వరస్ట్ పర్‌‌ఫార్మర్‌‌ని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్పినప్పుడు మ్యాగ్జిమమ్ ఓట్లు గీతూకే పడ్డాయి. ఎందుకు ఓటు వేశారో రీజన్స్ చెబుతున్నప్పుడు కూడా గీతూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. మనమంతా ఒక ఫ్యామిలీ అని చలాకీ చంటి ఏదో చెప్పబోతే.. మీరెవరూ నా ఫ్యామిలీ కాదు, నేనలా అనుకోను అంటూ చిత్ర విచిత్రమైన లాజిక్కులతో క్లాస్ పీకింది. – కూర్చుంది. 

ఇదేం గోల ఇనయా?
గీతూ తర్వాత అందరినీ ఇరిటేట్ చేస్తున్న కంటెస్టింట్ ఇనయా. కెప్టెన్సీ టాస్క్ సమయంలో నేహ తప్పు చేయడంతో ఆమెని వరస్ట్ పర్‌‌ఫార్మర్‌‌గా సంచాలకురాలు ఫైమా నామినేట్ చేసింది. నేహ దాన్ని వ్యతిరేకించింది. ఇంతలో ఇనయా మధ్యలో దూరిపోయి జడ్జిమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. నువ్వు మాట్లాడకు అని నేహ ఎంత చెప్పినా వినలేదు ఇనయా. చివరికి అభినయశ్రీ కల్పించుకుని సర్ది చెప్పడంతో ఆగింది. తర్వాత బాలాదిత్య ఆమెనే వరస్ట్ పర్‌‌ఫార్మర్‌‌గా నామినేట్ చేశాడు. అప్పుడతను ఒక రీజన్ చెప్పాడు. ఇనయాని వరస్ట్ అని నేను అనడం లేదు, కానీ తన పద్ధతి నాకు అస్సలు అర్థం కాదు, అన్నీ నెగిటివ్‌గా తీసుకుంటుంది అని చెప్పాడు. తను నన్ను మంచి కలర్‌‌ ఉంటారు, అందంగా ఉంటారు అని చెప్పినదాన్ని.. ఓ సందర్భంలో వాడినా అపార్థం చేసుకుంది అని చెబుతూ ఉండగానే ఇనయా అందుకుంది. అతనేం చెబుతున్నాడో కూడా వినకుండా నానా రభసా చేయడం మొదలుపెట్టింది. బాలాదిత్య పేషెన్స్ కోల్పోకుండా నవ్వుతూనే నిలబడ్డాడు. ఇక ఆమె ఆపేలా లేదని వెళ్లి కూర్చుండిపోయాడు. ఆ తర్వాత శ్రీహాన్‌తోనూ గొడవేసుకుంది ఇనయా. అతనితో హార్ష్ గా మాట్లాడటంతో పాటు నేను కష్టపడి వచ్చాను, నీలా ఎవరి సపోర్ట్ తోనో రాలేదు అంటూ సిరి పేరు ఎత్తడంతో శ్రీహాన్ రివర్సయ్యాడు. బయటివాళ్ల గురించి మాట్లాడకు అంటూ సీరియస్ అయినా ఇనయా చెప్పాల్సింది చెప్పే ముగించింది. ఆ తర్వాత కాసేపటికి శ్రీహాన్ వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడామె కీర్తికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయంటూ తప్పుగా మాట్లాడటంతో శ్రీహాన్ బుర్ర తిరిగిపోయింది. ఇక ఆమెకి చెప్పినా ఉపయోగం లేదని సైడైపోయాడు. ఈ విషయం తెలిస్తే కీర్తి ఎలా రియాక్టవుతుందో మరి!

ఏదేమైనా కొందరు కంటెస్టెంట్ల ఆవేశం వల్ల హౌస్‌ మొత్తం వేడెక్కుతోంది. ఎలాగూ వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఇక నాగార్జున చేతికి పగ్గాలు వెళ్లిపోతాయి. మరి ఈ రాత్రికి ఆయన ఎవరికి క్లాసులు పీకుతారో, ఎవరికి కాంప్లిమెంట్లు ఇస్తారో చూడాలి.