బిగ్‍బాస్ హౌస్ మళ్లీ వేడెక్కింది..

బిగ్‍బాస్ హౌస్ మళ్లీ వేడెక్కింది..

వీకెండ్‌కి నాగార్జున వచ్చి క్లాసులు తీసుకున్నప్పుడు అందరూ సారీలు చెబుతారు. మారిపోతామని మాటిస్తారు. ఇకపై బెస్ట్ కంటెస్టెంట్ అంటే నేనే అన్నంత బిల్డప్ ఇస్తారు. ఆయన అలా వెళ్లగానే మళ్లీ మామూలే. ప్రతి సీజన్‌లోనూ ఇలా జరగడం కామనే. మొదటి వీకెండ్‌ ఎపిసోడ్స్ ముగిసీ ముగియగానే హౌస్ మళ్లీ వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియ ఆ హీట్‌ని మరింత పెంచింది.

ఆరోహి ఆక్రోశం

ఎలిమినేషన్స్ లో ఉన్న ముగ్గురిలో ఎవరితో మీకు ప్రాబ్లెమ్ ఉందని నాగ్ అడిగినప్పుడు ఇనయాతో పాటు ఆరోహి పేరు కూడా చెప్పాడు సూర్య. ఆ ఎఫెక్ట్ ఇవాళ్టి ఎపిసోడ్‌లో బాగా కనిపించింది. సూర్య తన పేరు చెప్పడమేమిటని ఆరోహి బాగా ఆక్రోశించింది. అతని మైక్‌ని దాచేసింది. అతనేమో తనదే అనుకుని ఇనయా మైక్ వేసుకుని తిరుగుతున్నాడు. తర్వాత చూసుకుని ఆమె మైక్ ఆమెకి ఇచ్చేశాడు. ఆరోహి మాత్రం సూర్య మైక్‌ని తెలివిగా వేరేవాళ్లతో ఇప్పించింది. లాకర్‌‌లో దొరికిందని చెప్పించింది. ఆ తర్వాత నేరుగా సూర్యతో గొడవేసుకుంది. నా పేరు నువ్వెలా చెబుతావ్ అంటూ రచ్చ చేసింది. సూర్య సర్దిచెబుదామని ట్రై చేసినా వినలేదు. ఇంతలో కీర్తి కల్పించుకుని చిన్న క్లాస్ పీకింది. మీరిద్దరూ అందరి ముందూ మిమ్మల్ని మీరు బైటపెట్టుకోకండి, చాలామంది చూస్తున్నారు అంటూ హితబోధ చేసింది. వాళ్లని సార్టవుట్ చేసుకోనివ్వమంటూ కీర్తిని బాలాదిత్య లాక్కుపోయాడు. కాసేపటికి ఆరోహికి సూర్య సారీ చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆరోహి తెగ గారం చేసింది. వాళ్ల కెమిస్ట్రీ కెమెరాల కంటపడింది.

ఇక ఇంతేనా ఇనయా!

అందరూ తనపై నెగిటివ్‌గా మాట్లాడినందుకు ఆదివారం ఎపిసోడ్‌లో బాగా హర్టయ్యింది ఇనయా. అప్పటి నుంచి అందరితోనూ అంటీ ముట్టనట్టుగా ఉంటోంది. ఆమె అలా ఉండటం చూడలేక కొందరు సర్ది చెబుదామని చూసినా నార్మల్ అవ్వడం లేదామె. శ్రీసత్య సరదాగా ఏదో అంటే నెగిటివ్‌గా తీసుకుని ఫీలైపోయింది. కీర్తి ఎంతగా కన్విన్స్ చేయాలనుకున్నా ఏదో చెప్పి తప్పించుకుని వెళ్లిపోయింది. మైక్ దాచినందుకు కెప్టెన్‌గా యాక్షన్ తీసుకోవాలంటూ ఆరోహిపై బాలాదిత్యకి పితూరీలు చెప్పింది. కూల్‌గా ఉన్నట్టే కనిపిస్తోంది కానీ మనసులో చాలా మథనపడుతోందని అర్థమైపోతోంది. మరి ఎప్పటికి నార్మల్ అవుతుందో చూడాలి.

కుండ బద్దలు కొట్టారు

నామినేషన్ ప్రక్రియ కోసం భలే కొత్త కొత్త విధానాలు కనిపెడుతుంటాడు బిగ్‌బాస్. పోయినవారం ఓ పేపర్‌‌ మీద పేరు రాసి కమోడ్‌లో వేసి ఫ్లష్ చేయమన్నాడు. ఈసారి కుండకి ఫొటో అతికించి బావిలో వేయమన్నాడు. దాంతో కుండని అడ్డం పెట్టుకుని కొందరు హౌస్‌మేట్లు కుండ బద్దలు కొట్టినట్టు తమ అభిప్రాయాలు చెప్పేశారు. ఈసారి కూడా ఎక్కువమంది నోటి నుంచి వచ్చిన పేరు గీతూనే. ఎంత చెప్పినా యాటిట్యూడ్ తగ్గించుకోవట్లేదని, మాట తీరు మార్చుకోవాలని ప్రయత్నించడం లేదనేదే అందరి కంప్లయింట్. మగాళ్లకి బుద్ధి లేదు అంటూ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని శ్రీహాన్ తప్పుబట్టాడు. హౌస్లో మనకి ఇష్టం లేనివి జరుగుతున్నా కాస్త అడ్జస్ట్ అవ్వక తప్పదంటూ సుదీప సున్నితంగా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ  గీతూ ఒప్పుకునే టైప్ కాదు కాబట్టి కాస్త వాయిస్ రెయిజ్ చేయాల్సి వచ్చింది. చంటి కూడా గీతూ లోపాల్ని క్లియర్గా చెప్పాడు. ఆమె జస్టిఫై చేసుకోడానికి రకరకాలుగా ట్రై చేసినా అతను తన వాయిస్‌ని స్ట్రాంగ్‌గా వినిపించాడు. ఇక రేవంత్ అయితే నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం అనేశాడు. ఇంకెంతమంది ఆమెని నామినేట్ చేసినా అన్నింటికీ కారణం ఒక్కటే.. మాటతీరు. అది మారేంత వరకు వాళ్ల ఆప్షన్ కూడా మారకపోవచ్చు. ఇక ఆ తర్వాతి స్థానం రేవంత్‌ది. అతను కూడా ఆవేశం తగ్గించుకోవడం లేదని, అందరినీ నవ్విద్దామని అతను వేసే జోక్స్ ఓవర్ బోర్డ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారంతా. కొందరు సున్నితంగా చెప్పడంతో తనను తాను మార్చుకుంటానని రేవంత్ హామీ ఇచ్చాడు. కానీ కీర్తి టోన్ పెంచేసరికి తన రియల్ నేచర్‌‌లోకి వచ్చేశాడు. గీతూ విషయంలోనూ కాస్త కంట్రోల్ తప్పాడు. నీతో మాట్లాడటమంటే అశుద్ధం మీద రాయి వేసినట్టే అని కూడా అన్నాడు. ఈ మాట తీరుతోనే ప్రతిసారీ రిస్కులో పడుతున్నాడు. కాకపోతే ప్రతిసారి కంటే ఈసారి కాస్త బ్యాలెన్స్డ్‌గా ఉన్నాడని అనుకోవచ్చు. ఇక సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ షానీని కూడా ఇద్దరు నామినేట్ చేశారు.  

సిల్లీ రీజన్స్

వంక లేనమ్మ డొంక కోసం వెతికిందని సామెత. నామినేషన్స్ కి కొందరు చెప్పిన రీజన్స్ కూడా అలానే ఉన్నాయి. ఎవరు బైటికి వెళ్లిపోతే హౌస్‌ బాగుంటుందో వాళ్లని నామినేట్ చేయమని బిగ్‌బాస్ ముందే చెప్పాడు. అయినా కూడా తనకి అంత కనెక్ట్ కాలేదంటూ ఆదిరెడ్డి పేరు చెప్పింది ఆరోహి. దానికి అతను హర్ట్ అయ్యాడు.  ‘ఆడనివాళ్లు వెళ్లాలా కనెక్ట్ కానివాళ్లు వెళ్లాలా’ అని ఆరోహిని అడిగాడు. ఆడనివాళ్లే వెళ్లాలని ఆమె చెప్పింది. మరి కనెక్ట్ కాలేదని నన్నెలా నామినేట్ చేశావ్ అని అడిగితే.. మీరు ఆట కూడా పెద్దగా ఆడట్లేదంది ఆరోహి. మీరు మాత్రం ఏం పొడిచేశారు అన్నట్టు మాట్లాడిన ఆదిరెడ్డి.. ఆ తర్వాత తానూ ఓ సిల్లీ రీజన్‌తోనే నామినేట్  మెరీనా, రోహిత్‌ల జంటను నామినేట్ చేయడం విశేషం. మీరు జంటగా వచ్చారు, మీవి రెండు బ్రెయిన్స్, కాబట్టి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది, అందుకే నామినేట్ చేశానన్నాడు. దానికి వాళ్లిద్దరూ బాగా ఫీలయ్యి తిరిగి ఆదిరెడ్డిని నామినేట్ చేశారు. ఫైమా తనతో బాగా ఉండటం లేదంటూ వాసంతి తనని నామినేట్ చేసింది. విచిత్రమేమిటంటే.. బాలాదిత్య కూడా నామినేషన్ విషయంలో ఈసారి మెచ్యూర్డ్ గా లేడనిపించింది. అందరికీ ఒక్కొక్కరినే నామినేట్ చేసే అవకాశమిచ్చి.. కెప్టెన్ కావడంతో బాలాదిత్యకి మాత్రం ఇద్దరిని నామినేట్ చేసే రైట్ ఇచ్చారు. అతను ఎవరూ ఊహించని విధంగా షానీని, రాజ్‌ని నామినేట్ చేశాడు. క్లాస్‌ నుంచి ట్రాష్‌కి వచ్చి కూడా తాను కెప్టెన్ అయ్యి సేవ్ అయినట్టు, మీరిద్దరూ కూడా సేవ్ అవుతారనే నమ్మకంతోనే నామినేట్ చేస్తున్నానన్నాడు. కానీ నిజానికి హౌస్‌లో వాళ్లిద్దరి పార్టిసిపేషన్ ఎక్కువ లేదు. ఇద్దరూ కామ్‌గా ఉంటారు. రాజ్ కనీసం అప్పుడప్పుడూ అయినా మాట్లాడతాడు కానీ షానీ అస్సలు ఎందులోనూ కల్పించుకోడు. వాళ్లు స్ట్రాంగ్ ఎలా అయ్యారో, ఎలా సేవ్ అవుతారో అతనికే తెలియాలి. అతని గెస్సింగ్ ఎంతవరకు కరెక్టవుతుందో వేచి చూడాలి.

మొత్తానికి నామినేషన్ ప్రక్రియ ముగింది. ఈసారి ఎలిమినేషన్‌కి చాలామందే పోటీ పడుతున్నారు. గీతూ, రేవంత్, షానీ, రాజ్, అభినయశ్రీ, మెరీనా, రోహిత్, ఫైమా, ఆదిరెడ్డిలు నామినేట్ అయ్యారు. ఆదిరెడ్డి, షానీ, రాజ్, అభినయశ్రీల మీద అంతగా అంచనాలు లేవు. కాబట్టి ఓట్లు తక్కువ పడే చాన్స్ ఉంది. కాకపోతే గీతూ మీద చాలా నెగిటివిటీ ఉంది కాబట్టి ఆమెని బైటికి పంపాలని జనాలు పట్టుబట్టి ఓట్లు వేయకపోతే గీతూకి కచ్చితంగా రిస్కే. రేవంత్‌ నోరు చెడ్డదైనా అతని ఇంటెన్షన్స్ మంచివి. పైగా ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ. కాబట్టి తన విషయంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేం. మిగతా వారి విషయం కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.