తెలుగు బిగ్బాస్: హోటల్‌ టాస్క్పై కంటెస్టెంట్ల కన్‌ఫ్యూజ్

తెలుగు బిగ్బాస్: హోటల్‌ టాస్క్పై  కంటెస్టెంట్ల కన్‌ఫ్యూజ్

కెప్టెన్సీ పోటీకి అర్హత సంపాదించడం కోసం బిగ్‌బాస్ హోటల్ గేమ్‌ను మొదలుపెట్టారు కంటెస్టెంట్లు. మొదటి రోజు పూర్‌‌ పర్‌‌ఫార్మెన్స్ తో తెగ బోరు కొట్టించేశారు. మరి రెండో రోజైనా కాస్త స్ట్రాటజీలు మార్చారా? చక్కగా ఎంటర్‌‌టైన్ చేయగలిగారా?  

అంత కంగారెందుకో!

అసలు హోటల్‌ టాస్క్ గురించి కంటెస్టెంట్లకి సరిగ్గా అర్థమయినట్టు లేదు. అందుకే తెగ కన్‌ఫ్యూజ్ అయిపోయారు. వాళ్లలో వాళ్లే గంటలు గంటలు చర్చలు జరిపారు. అదన్నారు ఇదన్నారు. అంతా అయ్యాక ఇది కాదు తూచ్ అన్నారు. వాళ్లు కన్‌ఫ్యూజయ్యి.. పక్కవాళ్లని కన్‌ఫ్యూజ్ చేసి.. చివరికి ఆడియెన్స్ ని కూడా కన్‌ఫ్యూజ్ చేసి పారేశారు. ఇది నిజానికి కొత్త టాస్క్ ఏమీ కాదు. ప్రతి సీజన్‌లో ఉండేదే. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే దీనిలో పర్‌‌ఫార్మ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. పోనీ కనీసం గత సీజన్లను జాగ్రత్తగా చూసి వచ్చివున్నా ఈ ఆట ఎలా ఆడాలో తెలిసి ఉండేది. కానీ మనోళ్లు ప్రతి విషయంలోనూ బాగా వెనకబడి ఉన్నారు. అసలు ఆటను అర్థం చేసుకోవడంలోనే తడబడ్డారు. కాసేపు గ్రూపుగా ఆడదాం అంటారు. ఇంకాసేపు డీల్స్ పెట్టుకోకూడదంటారు. మరికాసేపు ఇండివిడ్యువల్‌గా వెళ్దామంటారు. గ్లామ్ ప్యారడైజ్ హోటల్‌కి మేనేజర్ అయిన ఫైమా కూడా ఏదో చేద్దామని ట్రై చేసి, ఏదేదో చేసేసి, చివరికి ఇలా కాదు తప్పు జరిగింది అంటూ మళ్లీ కొత్తగా ఆట మొదలెట్టింది. పైగా తనకి వివరంగా చెప్పాలని ప్రయత్నించిన సుదీప మీద చిరాకు పడిపోయింది. సుదీప స్ట్రాంగ్‌గా రియాక్టయ్యేసరికి గట్టిగా అరిచేసి హంగామా చేసింది. ఓ టైమ్‌లో శ్రీసత్య కూడా హర్ట్ అయ్యి నేను మీతో కలిసి ఆడను, విడిగా ఆడతాను అని ఫైమాకి చెప్పేసి వేరు కుంపటి పెట్టింది. చిన్న గేమ్ ఆడటానికి వీళ్లందరూ ఎందుకింత కంగారు పడిపోయారో అర్థమే కాలేదు.

ఫోకస్ ఎక్కడమ్మా!

ఆట ఆడండ్రా నాయనా అంటే కొంతమంది తమకిష్టమైన వాళ్ల మీదే ఫోకస్ పెట్టారు. గేమ్‌ని తమ సరదాలు తీర్చుకోడానికి వాడుకొన్నారు. అందులో అర్జున్ కళ్యాణ్‌ అయితే పీహెచ్‌డీ చేశాడనిపించింది. శ్రీసత్యతో సోది చెప్పడం, ఆమెతో తనకి నచ్చినవన్నీ చేయించుకోవడమే టార్గెట్‌గా ఈ ఆట ఆడాడు అర్జున్. అతను అవసరం లేకపోయినా టచ్ చేస్తున్నాడంటూ మొన్నటి వరకు గొడవ గొడవ చేసిన శ్రీసత్య.. ఈ టాస్క్ లో మాత్రం అతనేం చెప్పినా సరే అంది. తాను అడిగినంత ఇచ్చి ఏం కావాలో చేయించుకోమంది. దాంతో ప్రతి క్షణం ఆమె వెంటే తిరిగాడు అర్జున్. అతని ఫోకస్ ఆమె మీద తప్ప ఆటమీద లేదని ప్రతి ఫ్రేమ్‌లోనూ అర్థమైపోయింది. ఈ విషయాన్ని రేవంత్, వాసంతి కూడా డిస్కస్ చేసుకున్నారు. ఇక ఆట తెగ ఆడేస్తా, నేనేంటో చూపిస్తా అన్నట్టు ప్రతిదానికీ ఉరికే ఇనయా కూడా అందరివైపూ చూస్తూ కూర్చుంది తప్ప అంత యాక్టివ్‌గా కనిపించలేదు. ఒక్కసారి మాత్రం సూర్యతో కలిసి ఏదో ఎంటర్‌‌టైన్ చేయడానికి ట్రై చేసింది. గతం మర్చిపోయిన సూర్యకి నేనే నీ గాళ్‌ఫ్రెండ్‌ని అని గుర్తు చేస్తున్నట్టుగా డ్రామా చేసింది కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక సూర్య అయితే ఎంతసేపూ కెమెరాల మీద ఫోకస్ పెట్టాడే తప్ప ఆట మీద పెట్టలేదు. గతం గుర్తులేక ఒక్కోసారీ ఒక్కోలా ప్రవర్తిస్తాడన్నారు కదా అని ఏవేవో వింత వింత చేష్టలు చేశాడు. ఇనయాతో మాట్లాడుతున్నప్పుడు ‘గుణ’ సినిమాలోని కమల్ హాసన్ డైలాగ్ కూడా కొట్టాడు కానీ పేలలేదు. ఏదేమైనా బాగా ఫోకస్ పెట్టి హిస్టరీ క్రియేట్ చేస్తానంటూ మాటల్లో చూపించిన దమ్ము చేతల్లో చూపించలేకపోయాడు.

పప్పులే కాలేశాడు

ఆట ఏమో అంతంతమాత్రంగా ఆడుతూ అనవసరమైన విషయాల్లో మాత్రం అత్యుత్సాహం, అత్యంత ఆవేశం ప్రదర్శించారు కొందరు హౌస్‌మేట్స్. ఇలాంటి వాటిలో రేవంత్ ఎప్పుడూ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. పోయినసారి సుదీపతో ఫైట్ చేసినట్టు ఇవాళ బాలాదిత్యతో తిండి దగ్గర గొడవ పడ్డాడు. తాను తినడం మానేసి మరీ రేవంత్‌కి కూర, పప్పు వడ్డించాడు బాలాదిత్య. అయినా కూడా ఇంతేనా ఉన్నది, ఇంతేనా ఉన్నది అంటూ రేవంత్ విసిగించడంతో రయ్యిన లేచాడు. ఒకసారి ఓకే, రెండోసారీ ఓకే, ఎన్నిసార్లు అడుగుతావ్ అంటూ ఇరిటేట్ అయ్యాడు. నేను నిన్నేమీ అనలేదు కదా అంటూ రేవంత్ ఎప్పటిలానే అలిగి కూర్చున్నాడు. బాలాదిత్య ఈ విషయాన్ని అందరి దగ్గరా చెప్పి కడుపుమంట తీర్చుకున్నాడు. ఆ తర్వాత బాత్రూముల దగ్గర కాపలా కాస్తున్న రేవంత్‌ దగ్గరికి ఆదిరెడ్డి వచ్చి బాత్‌రూమ్‌కి వెళ్లనివ్వమని అడిగాడు. దానికి రేవంత్ నో అన్నాడు. మావాళ్లంతా మీటింగ్ పెట్టారు, ఇక్కడ నాకు రూపాయి రాదు, ఎవరి ఫేవరేట్‌ని వాళ్లు కాపాడుకునే పనిలో ఉన్నారు, అదెలాగూ తేలదు కాబట్టి వాళ్లు చెప్పిందేదో చేసి పారేస్తా, వందో రెండొందలో వస్తుంది కదా అంటూ పిల్ల చేష్టలు చేశాడు. ఇంతలో రోహిత్ వచ్చి నవ్వడంతో.. ‘నవ్వండి నవ్వండి.. రేపు బిగ్‌బాస్ టైటిల్ నేను పట్టేసినప్పుడు మీ నవ్వులు ఏమౌతాయో చూస్తా’ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ని ప్రదర్శించాడు. నిజానికి రేవంత్ మొదట్లో ఆడినంత బాగా ఆడటం లేదు. చాలామంది కంటే తను ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్. కానీ ప్రతి చిన్నదానికీ అలగడం, అనవసరమైన గొడవల్లో తల దూర్చి బ్యాడ్ అవడం, అవసరం లేని పంచాయతీలు పెట్టి తీర్పులు చెప్పడం తప్ప బ్రెయిన్ ఉపయోగించడం లేదు. దాంతో పర్‌‌ఫార్మెన్స్ పరంగా రోజురోజుకీ వీక్ అవుతున్నాడు. ఆ విషయాన్ని ఆడియెన్స్ గమనించేలోపే అతను తెలుసుకుంటే మంచిది. 

చంటి ఓడాడు.. వాళ్లు ఓడించబడ్డారు

బాలాదిత్య, రేవంత్‌లు మధ్యలో ఆట నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది. దానికి కారణం సెకండ్ రౌండ్‌లో రెండు హోటళ్లనీ మిక్స్ చేసేశాడు బిగ్‌బాస్. మొదటి రౌండ్ ముగిసేసరికి గ్లామ్ ప్యారడైజ్ వాళ్లు లీడింగ్‌లో ఉండటంతో బిగ్‌బాస్ హోటల్‌ని కూడా వాళ్ల అధీనంలోకి తీసుకెళ్లాడు. ఎవరైనా ఇద్దరిని తొలగించి మిగతా స్టాఫ్‌ని మీలో కలిపేసుకోమని చెప్పాడు. అప్పుడు ఆ టీమ్ అంతా కలిసి స్ట్రాంగ్ కంటెండర్స్ అయిన రేవంత్, బాలాదిత్యలను ఆట నుంచి తప్పించారు. ఇక చంటికి బిగ్‌బాస్ ఒక సీక్రెట్ టాస్క్ అప్పగించిన సంగతి తెలిసిందే. వీలైనంత ఎక్కువమందిని గ్లామ్ ప్యారడైజ్ హోటల్‌కి వెళ్లకుండా అడ్డుకుని బిగ్‌బాస్ హౌస్‌వైపు మళ్లిస్తే కెప్టెన్సీకి పోటీపడే వారిలో మీరూ ఉంటారని మంచి ఆఫర్ ఇచ్చాడు. కానీ అతను వాడుకోవాలి కదా. ఎప్పుడూ నీరసంగా, బద్దకంగా కనిపించే చంటి ఈ ఆటలో కూడా అదే తీరును కొనసాగించాడు. మొదట్లో ఎవరినో తమ హోటల్‌కి లాక్కు రావడానికి ఒక్కసారి ప్రయత్నించాడు. అంతే.. ఆ తర్వాత వదిలేశాడు. అందరి ఆటనీ చూశాడే తప్ప తాను సొంతగా ఆడిందేమీ లేదు. అసలు బిగ్‌బాస్ తనకొక పని అప్పగించిన విషయం అతనికి గుర్తుందో లేదో కూడా అర్థం కాలేదు. దాంతో ఆట ముగిసిన తర్వాత బిగ్‌బాస్.. చంటి సీక్రెట్ టాస్కులో పూర్తిగా ఫెయిలయ్యాడు అని ముఖమ్మీదే చెప్పేశాడు. అప్పుడు కూడా అతనితో పెద్ద ఫీలింగేమీ కనిపించలేదు. కొందరు కంటెస్టెంట్లు గేమ్‌ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదనడానికి ఇదే ఉదాహరణ.  

ఆరోహి ఆత్రానికి బ్రేక్ వేసిన బిగ్‌బాస్

ఎట్టకేలకి హోటల్ గేమ్ ముగిసిపోయింది. ఎవరి దగ్గర ఎంతుందో చెప్పమని బిగ్‌బాస్ అడగడంతో అందరూ తమ దగ్గరున్న అమౌంట్ చెబుతూ వెళ్లారు. సుదీప కూడా తన దగ్గరున్న మొత్తమెంతో చెప్పింది. దాంతో ఆరోహి తెగ కంగారుపడిపోయింది. ఎందుకంటే అందరూ ఇష్టమొచ్చినట్టు స్ట్రాటజీలు మార్చేసి దొంగాట ఆడారని, తనని మోసం చేశారని సుదీప బాధపడటంతో కొందరు తమ దగ్గరున్న డబ్బు కొంత సుదీపకి ఇచ్చారు. ఆ పాయింట్‌ని పట్టుకుంది ఆరోహి. మీకు ఎవరిచ్చారు, ఎప్పుడిచ్చారు, ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఇచ్చారా నిన్న ఇచ్చారా అంటూ ఆరాలు తీయడం స్టార్ట్ చేసింది. అయినా మనసు శాంతించక లేచి ముందుకొచ్చి నిలబడి మరీ బిగ్‌బాస్‌కి వివరించడం మొదలుపెట్టింది. అది ఓ రకంగా సుదీప మీద కంప్లయింట్ చేస్తున్నట్టు, తను కెప్టెన్సీ పోటీకి అర్హురాలు కాదని చెబుతున్నట్టే ఉంది. దాంతో బిగ్‌బాస్‌ తెలివిగా బ్రేక్ వేశాడు. కెప్టెన్సీ పోటీకి ఎవరు అర్హులనే విషయం సమయం వచ్చినప్పుడు చెబుతాను, ఇక మీరు వెళ్లండి అంటూ బై చెప్పేశాడు. 

మొత్తానికి ఒక బోరింగ్‌ గేమ్‌కి వీలైనంత త్వరగానే బ్రేకు వేసి ఆడియెన్స్ ని  గట్టెక్కించాడు బిగ్‌బాస్. అలా కాకుండా దీన్ని ఇంకా పొడిగించి ఉంటే మరో పస లేని ఎపిసోడ్‌ని చూడాల్సి వచ్చేది. అయితే రేపటి ఎపిసోడ్‌లో కాస్త ఎమోషన్స్ కూడా పండబోతున్నాయని ప్రోమో ద్వారా అర్థమవుతోంది. ఎప్పుడూ లేనిది ఫైమా, గీతూ తమ మనసులోని మాటలు షేర్ చేసుకుంటున్నారు. అంతకంటే విశేషం ఏమిటంటే ఏ విషయాన్నయినా తిరగేసి మరగేసి అవతలోడికి చుక్కలు చూపించే గీతక్క కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. దేనికీ చలించని ఆమెని ఏడిపించగలిగిన ఆ విషయమేంటో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.