
పాట్నా: నరేంద్ర మోదీ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నానంటూ జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. స్టేజీపై ఉన్న ఇతర నేతలు పొరపాటును తెలియజేయడంతో నితీశ్ తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చారు. కొద్ది రోజుల కింద కూడా ఆయన ఇలాగే ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. సీనియర్‌నేత రామ్‌విలాస్ పాశ్వాన్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అయితే పాశ్వాన్ 2020లోనే చనిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం పాట్నాలో ఎన్ డీఏ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నితీశ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మేము ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లకు పైగా గెలవాలని కోరుకుంటున్నం. నరేంద్ర మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, అప్పుడు భారతదేశం, బిహార్ అభివృద్ధి చెందుతుంది” అని నితీశ్ అన్నారు. వేదికపై ఉన్న బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ నితీశ్‌కు పొరపాటును తెలియజేశారు. దీంతో ఆయన సరిదిద్దుకుంటూ, మోదీ మళ్లీ ప్రధాని అవుతారని వివరణ ఇచ్చారు. 73 ఏండ్ల నితీశ్ఎన్నికల ప్రచారంలో రోజుల వ్యవధిలోనే ఇలా మాట తడబడటం ఇది రెండోసారి.