ఇవాళ నితీశ్ రాజీనామా!

ఇవాళ నితీశ్ రాజీనామా!
  • ఇయ్యాల నితీశ్ రాజీనామా!
  • మళ్లీ ఎన్డీయే కూటమిలో కలవనున్న జేడీయూ చీఫ్ 
  • బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం  
  • నేడు జేడీయూ, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం లంచ్ 
  • ఆ తర్వాత ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్ వద్దకు 
  • బిహార్​లో శరవేగంగా మారుతున్న రాజకీయాలు

జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ బిహార్​ సీఎం పదవికి రాజీనామా చేసి, బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్​కు మద్దతు లేఖలను అందజేసినట్టు సమాచారం. ఆదివారం లంచ్ తర్వాత జేడీయూ, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్దకు నితీశ్​ వెళ్తారని రెండు పార్టీల నేతలు చెప్తున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని ‘మహాఘట్​బంధన్’ ప్రభుత్వం కూలిపోయే 
స్థితిలో ఉందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి శనివారం పేర్కొన్నారు. 

పాట్నా:  బిహార్ లో మళ్లీ రాజకీయ అలజడి మొదలైంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని అధికార కూటమిలో విభేదాలు తలెత్తాయి. జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తున్నది. 

శనివారమే రిజైన్ చేస్తారని మొదట ప్రచారం జరగ్గా, ఆదివారం రాజీనామా చేయనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అందుకే సెక్రటేరియెట్ సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఆదివారం ఓపెన్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలందరూ తమ మద్దతు లేఖలను నితీశ్ కుమార్ కు అందజేసినట్టు తెలుస్తున్నది. జేడీయూ, బీజేపీ ఎమ్మెల్యేలకు నితీశ్ ఆదివారం లంచ్ ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత అందరూ కలిసి గవర్నర్ వద్దకు వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తన ప్రభుత్వంలోని ఆర్జేడీ మంత్రులను నితీశ్ తొలగించి, వారి స్థానంలో బీజేపీ నేతలను నియమిస్తారని, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీని డిప్యూటీ సీఎంగా నియమిస్తారని తెలిపాయి. 

మూడు పార్టీల సమావేశాలు.. 

నితీశ్ మళ్లీ ఎన్డీయే గూటికి చేరుతారన్న వార్తలతో ఆర్జేడీ అలర్ట్ అయింది. శనివారం పార్టీ సమావేశం నిర్వహించింది. మరోవైపు బీజేపీ మీటింగ్ కూడా జరిగింది. ఈ సమావేశాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న వాదనలకు బలం చేకూరుతున్నది. పాట్నాలోని ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ఇంట్లో ఆర్జేడీ మీటింగ్ జరిగింది. దీనికి పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

మీటింగ్ తర్వాత ఆర్జేడీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా మీడియాతో మాట్లాడుతూ.. నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీ చీఫ్ లాలూకే అప్పగించామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. అలాగే పాట్నాలో బీజేపీ మీటింగ్ కూడా జరిగింది. దీనికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికలు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సామ్రాట్ చౌధరి చెప్పారు. కాగా, జేడీయూ ముఖ్య నేతలు కూడా శనివారం సీఎం నితీశ్ ఇంటికి వచ్చారు. 

ప్రభుత్వం కూలిపోతది: కేసీ త్యాగి 

బిహార్ లోని ‘మహాఘట్ బంధన్’ ప్రభుత్వం కూలిపోయే స్థితిలో ఉందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి అన్నారు. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ వైఖరే కారణమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తరచూ నితీశ్ ను అవమానిస్తోందని మండిపడ్డారు. ఇక ఇండియా కూటమి పని కూడా అయిపోయినట్టేనని.. పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్ లో పొత్తులు లేనట్టేనని కామెంట్ చేశారు. కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర.. ఇండియా కూటమి తోడో యాత్రగా మారిందని బీజేపీ బిహార్ ఇన్ చార్జ్ వినోద్ తావ్డే విమర్శించారు. ముందు మమతా బెనర్జీ, ఇప్పుడు నితీశ్ కూడా ఆ కూటమి నుంచి బయటకొస్తున్నారని అన్నారు. 

నితీశ్ మనసులో ఏముందో: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే 

ఇండియా కూటమిలో తలెత్తిన విభేదాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. కూటమిలోని పార్టీలన్నీ ఐక్యంగా ఉండేలా కృషి చేస్తున్నామని చెప్పారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి నుంచి జేడీయూ వైదొలగుతున్నట్టు తనకు సమాచారం లేదన్నారు. నితీశ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, ఆయనకు లెటర్ కూడా రాశానని చెప్పారు. 

‘‘నితీశ్ మనసులో ఏముందో తెలియదు. ఏం జరుగుతుందో చూద్దాం. రేపు ఢిల్లీ వెళ్లాక పూర్తి సమాచారం తెలుసుకుంటాను” అని తెలిపారు. ‘‘టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారం ఏచూరితో మాట్లాడాను. అందరం కలసికట్టుగా ఉండాలని, అప్పుడే వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇవ్వగలమని వాళ్లతో చెప్పాను” అని పేర్కొన్నారు. కాగా, ఇండియా కూటమిలో చేరాలని హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీకి రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.