
పాట్నా: వరుసగా నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని నితీశ్ కుమార్ అధిష్టించనున్నారు. సీఎం పీఠంతోపాటు మంత్రి పదవుల కేటాయింపుపై ఆదివారం నిర్వహించిన జాయింట్ మీటింగ్‌లో ఎన్డీయే కూటమి నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్‌లో బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ, హెచ్‌ఏఎం, వీఐపీ పార్టీల కీలక నేతలు పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్‌ను ఎన్నుకున్నటు ఎన్డీయే ప్రకటించింది. ఇవ్వాళ బిహార్ గవర్నర్‌ను నితీశ్ కుమార్ కలవనున్నారు. రేపు సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బిహార్‌లో 74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించనున్నట్లు తెలుస్తోంది.