సోషల్ మీడియా వాడాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి

సోషల్ మీడియా వాడాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి
  •     బిహార్​లో ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గైడ్ లైన్స్
  •     ప్రభుత్వ లోగో సహా ఎలాంటి గుర్తులు పోస్టు చేయొద్దు
  •     కులం, మతం, వ్యక్తిని టార్గెట్ చేసుకునే కంటెంట్ పెట్టొద్దు
  •     ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

పాట్నా: బిహార్​లో సోషల్ మీడియా వాడకంపై ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర సర్కారు కఠినమైన గైడ్ లైన్స్  జారీ చేసింది. ఎవరైనా ఉద్యోగి సోషల్ మీడియా ఖాతా తెరవాలనుకుంటే ముందుగా సంబంధిత శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాపై నిషేధం విధించడం తమ ఉద్దేశం కాదని, డిజిటల్  స్పేస్ కు సంబంధించి  ఉద్యోగులు క్రమశిక్షణ, బాధ్యత, హుందాగా నడుచుకునేందుకు ఈ మార్గదర్శకాల ఉద్దేశమని తెలిపింది. గైడ్ లైన్స్  ప్రకారం.. ఫేక్  అకౌంట్లకు అనుమతి లేదు. ఉద్యోగులు తమ వ్యక్తిగత కంటెంట్ ను పోస్టు చేసేటపుడు తమ హోదా, ప్రభుత్వ లోగోతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి చిహ్నాలను పోస్టు చేయరాదు. అలాగే వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలకు అధికారిక ఈమెయిల్  ఐడీలు, ప్రభుత్వ ఫోన్  నంబర్లను వాడుకోరాదు. సామరస్యాన్ని దెబ్బతీసేలా అభ్యంతరకర, అసభ్యకరమైన, రెచ్చగొట్టే కంటెంట్  పెట్టరాదు. కులం, మతం, కమ్యూనిటీ లేదా వ్యక్తిని టార్గెట్  చేసుకుంటూ కంటెంట్ ను పోస్టు చేయరాదు. ప్రభుత్వ సమావేశాలు, కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉద్యోగులు షేర్  చేయరాదు. ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలపై సోషల్ మీడియాలో కామెంట్లు చేయకూడదు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, సీనియర్  అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు, విమర్శలు చేయకూడదు. లైంగిక దాడులకు గురైన బాధితులు, ఎవరైనా వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పోస్టు చేయరాదు. గైడ్ లైన్స్ ను ఉల్లంఘించిన ఉద్యోగులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మార్గదర్శకాల్లో ప్రభుత్వం హెచ్చరించింది. కాగా.. ఇంతకుముందు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు తీవ్ర వివాదానికి దారి తీశాయి. దీంతో ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.