బిహార్ లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 50కి చేరింది. సరన్ జిల్లాలోని చాప్రాలో జరిగిన ఈ ఘటనలో ఇంకా కొంత మంది ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరిలో కొందరి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న చాప్రా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) రితేశ్మిశ్రాతో పాటు కానిస్టేబుల్ వికాస్ తివారీని ఇప్పటికే ఆ ప్రాంత ఎస్పీ సస్పెండ్ చేశారు. 2016 నుంచి బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నా.. కల్తీ లిక్కర్ ఏరులై పారుతున్నదని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం నితీశ్‌పై మండిపడ్డారు. కల్తీ మద్యం కారణంగానే వారంతా చనిపోయారని, డాక్టర్లు మాత్రం దీన్ని అధికారికంగా ప్రకటించేందుకు భయపడుతున్నారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి.. సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు రాష్ట్రంలో చాలా మంది లిక్కర్ తాగడం మానేశారని, లిక్కర్ బ్యాన్‌ను ఇప్పటికే చాలా మంది ఆమోదించారని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. కల్తీ మద్యం అమ్మేవాళ్లపై కఠిచ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్న ఆయన.. మొదటి నుంచి ప్రజలు విషపూరిత మద్యంతో చనిపోతున్నారని చెప్పారు. లిక్కర్ విషయంలో మహాత్మా గాంధీ ఏం చెప్పారో మీకు తెలుసని, వరల్డ్‌వైడ్‌గా పరిశోధనలు ఏం చెబుతున్నాయో కూడా మీకు తెలుసన్నారు. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా కల్తీ లిక్కర్‌తో చనిపోతున్నారన్న నితీశ్... ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పుడు.. కల్తీ లిక్కరే దొరుకుతుందని, ఇది తాగేవాడు కచ్చితంగా చచ్చిపోతాడని, కల్తీ మద్యంపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటమని నితీశ్ అన్నారు.
