కోర్టు ఆవరణలో అండర్​ ట్రయల్​​ ఖైదీ హత్య.. పాట్నాలోని దానాపూర్​లో​ ఘటన

కోర్టు ఆవరణలో అండర్​ ట్రయల్​​ ఖైదీ హత్య.. పాట్నాలోని దానాపూర్​లో​ ఘటన

పాట్నా: విచారణ కోసం కోర్టుకు తీసుకొచ్చిన అండర్ ట్రయల్ ఖైదీని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. బీహార్​లోని పాట్నాలో గల దానాపూర్​ కోర్టు ఆవరణలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సికిందర్‌‌పూర్ కు చెందిన అభిషేక్ కుమార్ అలియాస్ ఛోటే సర్కార్‌‌పై మర్డర్​తోపాటు ఇతర అనేక కేసులు ఉన్నాయి. ఛోటే సర్కార్‌‌ ఓ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా బ్యూర్ జైలులో ఉన్నాడు. శుక్రవారం విచారణ నిమిత్తం అతన్ని పోలీసులు దానాపూర్ కోర్టుకు తీసుకొచ్చారు. అదే టైంలో ఇద్దరు దుండగులు కోర్టు ఆవరణలోకి వచ్చి ఛోటే సర్కార్‌‌పై కాల్పులు జరిపారు. దీంతో సర్కార్​ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ వెంటనే పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌‌కు తరలించారు.

వారిని ముజఫర్‌‌పూర్‌‌కు చెందినవారిగా గుర్తించారు. అయితే, వారిని ఎవరు పంపారు? ఈ హత్య వెనుక  ఎవరు ఉన్నారు? తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఈ ఘటనతో కోర్టు కాంప్లెక్స్‌‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 2019లోనూ దానాపూర్ కోర్టు వెలుపల ఇలాంటి ఘటనే జరిగింది. అండర్ ట్రయల్ ఖైదీలకు ఎస్కార్ట్​గా వచ్చిన పోలీసులపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి చనిపోయాడు.