ఎలా తేలేనో .. ? బిహార్ మోడల్!

ఎలా తేలేనో .. ? బిహార్ మోడల్!

విమర్శలు, సమర్థింపులు వంటి వివాదాల నడుమ బిహార్​లో  భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్​ జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్​ఐఆర్​) తొలిదశ పూర్తయింది. మలిదశ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయితే ఇదే ప్రక్రియ, పద్ధతిన దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.  

మూకుమ్మడిగా లక్షల ఓట్లను ఎస్​ఐఆర్​ పేరిట తొలగించడం కుట్రపూరిత చర్య అని, ఇది దొడ్డిదారిన నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజన్​ (ఎన్​ఆర్​సీ) ని అమలుపరచడమేనని ‘ఇండియా’  విపక్ష కూటమి ఆరోపిస్తోంది. జోక్యం జేసుకొని ప్రక్రియను నిలిపివేయాలని కోరితే ‘జరిగేది జరగనివ్వండి, అర్హులైన ఓటర్లను తొలగించినపుడు తగిన ఆధారాలతో వస్తే తప్పక జోక్యం చేసుకుంటామ’ ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఆగస్టు 1న ఎన్నికల సంఘం 7.24 కోట్ల మంది ఓటర్లతో ‘ముసాయిదా జాబితా’ను వెల్లడి చేసింది. ఈ నెలాఖరు వరకు అభ్యంతరాలు, అదనపు సమాచారం సమర్పించి, ఎవరైనా తమ పేర్లు గల్లంతయ్యాయని భావిస్తే తిరిగి నమోదు చేయించుకోవచ్చని తెలిపింది. ఇంతలోనే దేశంలో ఓట్ల దొంగలు పడ్డారంటూ విపక్ష నేత కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ కొత్త సమాచారం, సరికొత్త  విమర్శలతో దేశ ప్రజల ముందుకొచ్చారు. పలు ప్రశ్నలకు, పెక్కు సందేహాలకు భారత ఎన్నికల సంఘం సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

దేశ ఎన్నికల  ప్రక్రియలో పారదర్శకత లోపించడం, కీలకమైన పరిణామాలకు బాధ్యుల నుంచి సరైన స్పందన  లేకపోవడంతో ఎన్నికలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించే ఎస్​ఐఆర్​ ప్రక్రియను నిలిపివేయకపోతే, బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్ని తాము బహిష్కరిస్తామని ఆర్​జేడీ వంటి పార్టీ ప్రకటించేవరకు పరిస్థితి వెళ్లింది.

65 లక్షల ఓట్ల పంచాయితీ బిహార్​లో ఎస్​ఐఆర్​ ప్రక్రియ చేపట్టే నాటికి 7.89 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇది 2025 ఓటరు జాబితా లెక్క. తాజా ముసాయిదా జాబితా ప్రకారం 7.24 కోట్లు.  65 లక్షల ఓటర్లు తగ్గుతున్నారు. ఇందులో ప్రధానంగా 21 లక్షల మంది చనిపోయినవారు. 

3 లక్షల మంది ఇతర ప్రాంతాలకు  శాశ్వతంగా వలస వెళ్లినవారు, 7 లక్షల మంది ఆచూకీ తెలియనివారున్నారని ఎన్నికల సంఘం చెబుతోంది. అందుకే, తాము తగినంత సమయం ఇచ్చినప్పటికీ   65 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకోలేదన్నది వారి లెక్క.  ఇందులోనూ ఎవరైనా అర్హత కలిగిన ఓటర్లుండి ఏ కారణం చేతనైనా ఫాం నింపి నమోదు చేసుకొని ఉండకపోతే, ఆగస్టు మాసాంతం వరకు చెక్​ క్లెయిమ్​ ద్వారా సంబంధిత ఎన్నికల అధికారిని కలిసి తిరిగి నమోదు చేయించకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పాట్నాలో 3.5 లక్షలు, మధుబని, ఈస్ట్​ చంపారన్, గోపాల్ గంజ్​ జిల్లాల్లో మూడేసి లక్షలు, మరో పది జిల్లాల్లో రేండేసి లక్షలు, పదమూడు జిల్లాల్లో లక్ష ఓట్ల చొప్పున తగ్గాయి.

ఎలా నిర్ణయించారు?

ఇంతమంది చనిపోయారని, ఇందరు శాశ్వతంగా వలస వెళ్లారని, ఏ పత్రాల ఆధారంగా నిర్ణయించారని విపక్షం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తోంది. పేర్లు తొలగించిన ప్రతి ఒక్కరికీ నోటీసు ఇచ్చారా? వారిని కనీసం ఒక్కసారైనా కలిశారా? అన్నది వారి ప్రధాన ప్రశ్నలుగా ఉన్నాయి. 

బాధ్యత కలిగిన స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం ఉజ్జాయింపు అంచనాలు, లెక్కలతో పెద్దసంఖ్యలో ఓటర్లను తొలగించడం రాజకీయ విశాల కుట్రల భాగమన్నది ‘ఇండియా’ పక్షాల అభియోగం. ఇదే విషయాన్ని వారు కోర్టు దృష్టికి కూడా తీసుకువచ్చారు. లోగడ అస్సాంలో జరిగినట్టు ఒక మతం వారిని, వర్గంవారిని లక్ష్యం చేసుకుని తొలగిస్తున్నట్టుందని సందేహిస్తున్నారు. 

నివాసం, జన్మస్థలం నిర్ధారణ పత్రాలు సమర్పించాలని వారు అవకాశంగా ఇచ్చిన 11 పత్రాల్లో ఓటరు ఐడీ, ఆధార్​ లేవు. ఆధార్​ కార్డు, ఓటరు ఐడీని నిర్ధారణ పత్రాల జాబితాలో చేర్చండని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆగస్టు 12న ఈ కేసు తదుపరి విచారణ ఉంది. సుప్రీంకోర్టు మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. 

‘అర్హులను జాబితా నుంచి తొలగించారని ఊరికే ఆరోపిస్తే  ప్రయోజనం లేదని, ఎవరి పేర్లు తొలగించారో అలా 15మందిని కోర్టు సమక్షానికి తీసుకురండి.   మేం తప్పక జోక్యం చేసుకుంటాం అని చెప్పింది. విపక్షం కూడా ఈ విషయాల్లో కాస్త పట్టుదలగానే ఉంది.  నియోజకవర్గాలవారీగా ఎవరి పేర్లు తొలగించారో ఆ జాబితాలు, వివరాలిమ్మని డిమాండ్​ చేస్తోంది. 

పారదర్శకతే పెద్ద లోపం

 కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలున్నప్పుడు సిబ్బంది సహకారం కూడా నిర్వహణలో ఒక కీలకాంశం అవుతోంది.  తగు విచారణ జరపకుండా, లిఖిత ఉత్తర్వులివ్వకుండా ఒక పేరు కూడా జాబితా నుంచి తొలగించకూడదని చట్టం, ఎన్నికల నిబంధనావళి చెబుతోంది. 

ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి (సీఈఓ) వినోద్​సింగ్​ గుంజియాల్​ ఇస్తున్న సమాచారం పట్ల బిహార్​ విపక్ష పార్టీలు సంతృప్తితో లేవు. మొత్తం 90,712 పోలింగ్​ బూత్​ల వారీగా ఓటరు జాబితాలు ఉన్నాయి తప్ప నియోజకవర్గ, రాష్ట్రవ్యాప్త జాబితాలు అంటూ లేవు. రాష్ట్రంలో 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

 2003నాటికి ఎస్​ఐఆర్​ (చివర్లో నిర్వహించిన ముమ్మర సవరణ ఇదే) ప్రకారం రూపొందించిన జాబితా, 7 జనవరి 2025న ప్రకటించిన ఓటర్ల జాబితా, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పేర్లు నమోదు చేసుకోనివారు, పేర్లు తొలగింపునకు గురైనవారి జాబితాలు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. 

విపక్షాలవి నిరాధారపు నిందలని, గొంతెమ్మ కోరికలని విమర్శిస్తున్న పాలకపక్షాలు,  ప్రధానంగా బీజేపీ, జేడీయూలు ఎక్కడికి అక్కడ స్పష్టంగా సమాచారం అందుబాటులో ఉందని చెబుతున్నాయి. సుమారు లక్షమంది బూత్​స్థాయి అధికారులు  ఉన్నారని, లక్షన్నరమందికిపైగా బూత్​స్థాయి ఏజెంట్లను  అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘం అనుమతిస్తోందని పాలకపక్షం వారు పేర్కొంటున్నారు. అయినా న్యాయం జరగకుంటే జిల్లా మేజిస్ట్రేట్​ ముందో, చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసరు ముందో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. 

ఓట్ల దొంగలున్నారని రాహుల్​ ఆరోపణ

2025 ఎన్నికల్లో బెంగళూరు నుంచి జరిగిన ఎన్నికల అవకతవకలు, తప్పుడు ఓటర్ల జాబితాల విషయంలో విపక్ష నేత రాహుల్​ గాంధీ నిర్దిష్టంగా లేవనెత్తిన అంశాలకు ఎన్నికల సంఘం స్పందించాలి. సగటు పౌరుని సందేహాలకు అతీతంగా సమాధానం చెప్పాలి. మహారాష్ట్ర, హర్యానా, ఎంపీ ఎన్నికల్లోనూ గోల్​మాల్​ జరిగినట్టు ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. 

దేశంలో ఓట్ల దొంగలు పడ్డారు అని ఆరోపించిన రాహుల్​ నకిలీ, ఫేక్​ అడ్రస్​ ఓటర్లు, సింగిల్​ అర్బన్​ ఓటర్లు, చెల్లని ఫొటోల ఓటర్లు, ఫాం6ని కొత్త ఓటర్లుగా దుర్వినియోగం చేసినవారు  ఇలా.. అయిదు పద్ధతుల్లో ఓట్ల చౌర్యం జరుగుతోందని ఆరోపించారు. 
అవకతవకలను సాక్ష్యాధారాలతో నిరూపించాలి

అవకతవకలకు ఎన్నికల సంఘం తగిన సమాధానం ఇవ్వాల్సి ఉంది. అదే సమయంలో విపక్ష నేత రాహుల్​ గాంధీ కూడా ద్వంద్వనీతికి పాల్పడకుండా ఏకరీతిన వ్యవహరించాలి. బెంగళూరులోనో, మధ్యప్రదేశ్​లోనో, హర్యానాలోనో, మహారాష్ట్రలోనో దొంగ ఓట్లు ఉన్నాయని ప్రశ్నిస్తున్నప్పుడు బిహార్​లో చేపట్టిన ముమ్మర సవరణ ప్రక్రియను  నిర్హేతుకంగా విమర్శించకూడదు. తమ పార్టీ అన్ని స్థాయిల యంత్రాంగం సహాయ సహకారాలతో నిఘావేసి, తప్పిదాలను ఎత్తి చూపాలి. 

సవరణలు, సంస్కరణలకు నిర్మాణాత్మకంగా సహకరించాలి. బిహార్​లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియను దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒక అవకాశంగా తీసుకోవాలి.దురుద్దేశాలు, అవకతవకలుంటే వాటిని సాక్ష్యాధారాలతో సేకరించి, కేసు విచారణ ఎలాగూ దేశ అత్యున్నత న్యాయస్థానం సమక్షంలో ఉంది కనుక అక్కడ నిరూపించాలి. అవకతవకలకు అడ్డుకట్ట వేయాలి.  లేదా అంతా సవ్యంగా జరుగుతోందంటే.. రేపు దేశవ్యాప్తంగా జరిగే సవరణ (ఎస్​ఐఆర్) ప్రక్రియకు దీన్ని పైలట్​ ప్రాజెక్టుగా పరిగణించాలి. భాగస్వాములైనవారంతా కలిసికట్టుగా ప్రజాస్వామ్య సౌధం పునాదుల్ని పటిష్టపరచాలి. 

జవాబుదారీగా ఉండాలి

ప్రజాస్వామ్య పాలనా సౌధానికి పునాది ఎన్నికల ప్రక్రియ. రాజ్యాంగం, ఎన్నికల చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం వేర్వేరు నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యేవారంతా బాధ్యతతో వ్యవహరించాలి.  భారత ఎన్నికల సంఘం మొదలుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు కడకు ఓటర్లు తమ హక్కులు, అధికారాలకు పోరాడటమే కాకుండా తమ బాధ్యతల విషయంలో జవాబుదారీతనంతో నిలబడాలి. 

- దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ-

  • Beta
Beta feature
  • Beta
Beta feature