కూసుమంచి, వెలుగు: వేర్వేరు చోట్ల బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి వడ్త్యి హరి(19) మృతిచెందగా, వడ్త్యి మల్సూర్కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. గంగాబండతండాకు చెందిన వడ్త్యి హరి, వడ్త్యి మల్సూర్ మంగళవారం తండా నుంచి బైక్పై నేలకొండపల్లి వైపు వెళ్తుండగా పొద్దున10.30 గంటల టైంలో మల్లేపల్లి మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు కిందపడిపోయారు.
ఇద్దరూ రోడ్డు పక్క చెట్ల పొదల్లో పడిపోయారు. దీంతో వారు రాత్రంతా అక్కడే ఉన్నారు. బుధవారం పొద్దున ఓ పశువుల కాపరి చూసి పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ రమేశ్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లారు. స్పాట్లోనే హరి మృతి చెందగా మల్సూర్కు తీవ్ర గాయాలయ్యాయి. మల్సూర్ను వెంటనే పోలీసు కారులో హాస్పిటల్కు తరలించి ప్రాణాలు కాపాడారు.
శ్రీశ్రీ సర్కిల్లో యువతి..
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్లో స్కూటీని లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక యువతి చనిపోగా , మరో యువతి తీవ్రంగా గాయపడింది. వైరా హెచ్పీ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీకన్య, నూనవత్ రాణి స్కూటీపై ఖమ్మం నుంచి వైరా వెళ్తున్న క్రమంలో శ్రీశ్రీ సర్కిల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో శ్రీకన్య అక్కడికక్కడే మృతిచెందింది. రాణికి గాయాలవడంతో హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని ఢీకొట్టిన లారీ అతివేగంగా వెళ్తూ టేకులపల్లి బ్రిడ్జి వద్ద ఓ కారును కూడా ఢీకొట్టింది.
ఆటో, బైక్ ఢీకొని ఒకరు..
పాల్వంచ రూరల్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో బుధవారం ఓ వ్యక్తి చనిపోయాడు. పాల్వంచ రూరల్ ఎస్ఐ కార్తీక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామానికి చెందిన కాలం నర్సింహారావు(40), తన బైక్పై చింతగుంపు వెళ్తుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో నర్సింహారావు బైక్ను బలంగా ఢీకొంది. ఈప్రమాదంలో నర్సింహారావు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య పున్నమ్మ, పిల్లలు ఉన్నారు.