ఆగిన బైక్ లను ఢీకొట్టుకుంటూ వెళ్లిన లారీ

ఆగిన బైక్ లను ఢీకొట్టుకుంటూ వెళ్లిన లారీ
  • భార్య మృతి, భర్తకు గాయాలు 

  • ఇదే ఘటనలో చనిపోయిన మరొకరు.. 

  • సుచిత్ర క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం 

కంటోన్మెంట్, వెలుగు: ట్రాఫిక్​జామ్ కారణంగా ముందు వాహనాలు ఆగి ఉండడంతో బైక్​ను నిలిపి.. ఏం జరుగుతుందని ఆరా తీసేలోపే వెనక నుంచి స్పీడ్ గా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. దీంతో భార్య చనిపోగా.. భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే అదే లారీ ముందున్న మరో రెండు వాహనాలను ఢీకొట్టడంతో మరో వ్యక్తి మృతిచెందిన ఘటన సుచిత్ర క్రాస్​రోడ్డు వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బోయిన్​పల్లి ఎస్ఐ రాజు తెలిపిన ప్రకారం.. ఆకాశ్​చవారియా తన కుటుంబంతో గుండ్లపోచంపల్లి పరిధి కేవీ రెడ్డి నగర్​లో ఉంటున్నాడు. అతనికి గతేడాది నందినితో పెండ్లి అయింది. ముషీరాబాద్​లోని తన మామ ఇంటికి ఆకాశ్​దంపతులు రాయల్​ఎన్​ఫీల్డ్​పై బయలు దేరారు. రాత్రి 9.30గంటల సమయంలో  సుచిత్ర క్రాస్ రోడ్స్​సిగ్నల్​దాటిన తర్వాత డైరీ ఫామ్ సమీపంలో  పిల్లర్​నంబరు 44 వద్దకు చేరారు. అక్కడ రోడ్డుపై ట్రాఫిక్​ జామ్ ఏర్పడగా.. ముందు కొన్ని  బైక్​లు నిలిచాయి. దీంతో ఆకాశ్​కూడా తన బైక్​ను కూడా ఆపాడు. ఏం జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా వెనక నుంచి ఓవర్ స్పీడ్ గా వచ్చిన ఓ లారీ(ఏపీ 23యూ-7020) ఢీకొట్టింది. దీంతో బైక్​పై నుంచి ఆకాశ్, నందిని కిందపడిపోయారు. లారీ ముందు టైర్లు నందిని పైనుంచి వెళ్లగా తీవ్రంగా గాయపడింది. అక్కడితో లారీ ఆగకుండా ముందున్న మరో హోండా యాక్టీవా, పల్సర్​బైక్​లను ఢీకొట్టింది. దీంతో హోండా యాక్టీపై వెళ్తున్న ఆకాశ్ రాజ్(32), పల్సర్​పై వెళ్తున్న దుర్గా ప్రసాద్ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. నందినిని స్థానికంగా ఓ  ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతిచెందినట్లు తెలిపారు. ఆకాశ్ రాజ్,​ దుర్గా ప్రసాద్ లను బీబీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆకాశ్​రాజ్ చికిత్స పొందుతూ చనిపోయాడు.  కాళ్లకు గాయాలైన దుర్గాప్రసాద్ కు ట్రీట్ మెంట్ చేసి పంపించారు. లారీ డ్రైవర్​నిర్లక్ష్యంగా, ఓవర్ స్పీడ్ గా నడపడంతోనే యాక్సిడెంట్ జరిగిందని,  ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీని వదిలిపెట్టి పరార్ అవుతుండగా..  అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.