టాప్ 10 కుబేరుల లిస్ట్ నుంచి అదానీ ఔట్

టాప్ 10 కుబేరుల లిస్ట్ నుంచి అదానీ ఔట్

అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ కొట్టిన నివేదిక ఎఫెక్ట్తో దెబ్బకు అదానీ గ్రూప్ కోలుకోలేకపోతోంది. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. దీంతో అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-10లో చోటు కోల్పోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద 84.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో రూ.6 లక్షల కోట్లకు పైమాటే. అయితే గత 3 ట్రేడింగ్ సెషన్లలోనే గౌతమ్ అదానీ స్టాక్స్ దారుణంగా పతనమయ్యాయి. గత 24 గంటల్లోనే 8.21 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. పెద్ద మొత్తంలో సంపద కోల్పోయిన గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. ఇవాళ సెషన్‌లో కూడా అదానీ స్టాక్స్‌లో భారీ నష్టాలు కొనసాగితే ఆసియాలోనూ అత్యంత ధనవంతుడిగా ఉన్న తన స్థానాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది.

ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 82.2 బిలియన్ డాలర్లతో 12వ స్థానంలో ఉన్నారు. ఆసియా కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. అదానీకి, అంబానీకి మధ్య సంపదలో వ్యత్యాసం 2 బిలియన్ డాలర్లే కావడంతో.. అదానీ సంపద మరింత పతనమైతే.. ఆయన ఆసియా కుబేరుల్లో తన నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయి.. అంబానీ వెనుక నిలుస్తారు. ఇటీవల అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. గౌతమ్ అదానీ గ్రూప్.. స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని ఆరోపించింది హిండెన్‌బర్గ్. దీనిపై రెండేళ్ల పరిశోధన చేసి 4 రోజుల కిందట రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీనిపై అదానీ గ్రూప్ 413 పేజీల రెస్పాన్స్ కూడా విడుదల చేసింది. అయినప్పటికీ దీనిపై మరోసారి హిండెన్‌బర్గ్ విరుచుకుపడింది. జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకొని, అదానీ గ్రూప్ మోసాలు చేస్తుందని మరోసారి ఆరోపించింది.