
నటీనటులు: కళ్యాణ్ రామ్, క్యాథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్, ప్రకాష్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, అయ్యప్ప పి శర్మ తదితరులు
సంగీతం: చిరంతన్ భట్, కీరవాణి
బ్యాగ్రౌండ్ స్కోర్: కీరవాణి
నిర్మాణం: హరికృష్ణ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మల్లిడి వశిష్ట్
కమర్షియల్ పంథాలోనే సాగినా మొదట్నుంచీ కంటెంట్‌లో వెరైటీని చూపించడానికే ట్రై చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈసారి హిస్టారిక్ బ్యాక్‌డ్రాప్‌తో ‘బింబిసార’ చిత్రం చేశాడు. టీజర్లు, ట్రైలర్లు చూశాక సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని బింబిసారుడు అందుకున్నాడా? విజయాన్ని సొంతం చేసుకున్నాడా లేదా? ఓసారి చూద్దాం.
కథేమిటంటే..
త్రిగర్తలను పాలించే బింబిసారుడు (కళ్యాణ్ రామ్) పరమ క్రూరుడు. అతని నిలువెల్లా అహంకారమే. తనకి నచ్చినట్టు పాలిస్తాడు. ఎదురు తిరిగినవారి ప్రాణం తీసేస్తాడు. ప్రజల కష్టాలు పట్టవు. ఎదుటివారి కన్నీళ్లు కూడా అతనిని కరిగించలేవు. చివరిఇక తన సొంత తమ్ముడైన దేవదత్తుడిని కూడా చంపేయాలనుకుంటాడు. కానీ తృటిలో తప్పించుకున్న దేవదత్తుడు.. ఓ మాయా దర్పణం సాయంతో బింబిసారుణ్ని మాయం చేసి, అతని స్థానంలో సింహాసనమెక్కుతాడు. ఇటు దర్పణం కారణంగా నాటి త్రిగర్తల నుంచి నేటి కాలానికి వచ్చి పడతాడు బింబిసారుడు. అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వాటిని అతనెలా ఫేస్ చేశాడు, తిరిగి తన రాజ్యానికి వెళ్లాడా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
బింబిసార సినిమాని అనౌన్స్ చేసినప్పుడు అందరిలోనూ రెండు ప్రశ్నలు తలెత్తాయి. అసలే సక్సెస్ కోసం తపన పడుతున్న కళ్యాణ్ రామ్‌కి ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్ అవసరమా? కొత్త దర్శకుడు ఇంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ను యాక్సెప్ట్ చేయగలడా? వీటికి సమాధానాలు చెప్పడం కష్టమే. ఎందుకంటే బాహుబలి లాంటి సినిమాతో ఓ స్టాండర్ట్ క్రియేట్ చేసేశారు రాజమౌళి. దాన్ని మించి కాదు కదా, దాని దరిదాపుల్లో చేరే విధంగా కూడా ఎవరూ తీయలేరనే అభిప్రాయం ప్రేక్షకుల్లోనే కాక ఇండస్ట్రీ వర్గాల్లో కూడా బలపడిపోయింది. అయితే తమ సినిమాని బాహుబలితో పోల్చొద్దని, ఆ స్థాయిలో కాకపోయినా అంచనాలకు తీసిపోదని పదే పదే చెప్పాడు కళ్యాణ్ రామ్. అతని మాట నిజమేనని ఇవాళ రుజువయ్యింది. బింబిసారుడు బాహుబలి అంతటోడు కాదు. అలా అని అతడూ తక్కువేమీ కాదు.
టైమ్ ట్రావెట్ కాన్సెప్ట్ అనేది ఒకప్పుడు మనకి అంతగా తెలియకపోయినా.. ఈ మధ్య కొన్ని సినిమాలు రావడంతో కాస్త అలవాటయ్యింది. ఈ సబ్జెక్ట్ కూడా అదే తరహాలో ఉంటుంది. అయితే మిగతా వాటితో పోల్చలేనంత డిఫరెంట్‌గా ఉంది. కన్నూ మిన్నూ గానకుండా అహంకారంతో విర్రవీగే ఓ రాజు, అతనికి బుద్ధి చెప్పడానికి చేసే ప్రయత్నంలో గతం నుంచి వర్తమానంలోకి వచ్చి పడటం, అక్కడ మనిషంటే ఎలా ఉండాలో తెలుసుకోవడం లాంటివి చూసినప్పుడు ఈ కథ ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఒకరకంగా చెప్పుకున్నంత ఈజీ కాదు ఈ కథని తెరకెక్కించడం. ఎందుకంటే ఒక టైమ్ నుంచి ఇంకో టైమ్‌కి వచ్చేటప్పుడు సరైన కనెక్టివిటీ లేకపోతే ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోతారు. కానీ అలా కానివ్వలేదు వశిష్ట. సాధారణంగా వర్తమానం నుంచి గతంలోకి వెళ్లే రొటీన్ ఫార్మాట్‌ని వదిలేసి.. గతంతో మొదలుపెట్టి వర్తమానంలోకి కథని లాక్కురావడంలోనే అతని ఇంటెలిజెన్స్ కనిపించింది.
సినిమా మొదలవ్వగానే హీరో ఎంట్రీ ఇచ్చేయడం చూస్తే ఇదేంటబ్బా ఇంత ఈజీగా పరిచయం చేసేశారు అనుకుంటాం. స్టార్టింగ్‌లోనే ఇంత సింపుల్‌గా ఉంటే ఉండే కొద్దీ కథ తేలిపోతుందేమో అనుకుంటాం. కాసేపు కాస్త బోర్ ఫీలవుతాం కూడా. కానీ సింపుల్‌గా మొదలుపెట్టి సెన్సేషనల్‌గా మార్చాలనుకున్నాడో ఏమో.. తన కథకి ఓ కొత్త స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ఎప్పుడైతే కథ మలుపు తిరుగుతుందో అప్పట్నుంచి స్క్రీన్‌కి కట్టిపడేస్తాడు ప్రేక్షకుల్ని. ఎవరినీ లెక్క చేయనివాడిని తానెవరో తెలియని లోకంలోకి తీసుకొస్తే ఉండే కన్‌ఫ్యూజన్.. ఎదుటివారి జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకునేవాడికి జీవితమంటే ఏమిటో తెలిపే ఎమోషన్.. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పీక్స్ కు తీసుకెళ్లే ఇంటర్వెల్ బ్యాంగ్.. వీటితో అప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేసి, బింబిసారుడితో ప్రేమలో పడిపోతారు చూసేవారు. ఆ తర్వాత కథ కాస్త నెమ్మదించినా.. ప్రెజెంట్‌కి, పాస్ట్కి షిఫ్టవుతూ సాగే సీన్స్ బోర్ ఫీలవ్వనివ్వవు. అక్కడే ఈ కథ మార్కులు కొట్టేసింది.
ప్లస్సులూ మైనస్సులూ..
ఈ సినిమాకి మొట్టమొదటి ప్లస్.. కళ్యాణ్ రామ్ పడిన కష్టం. మొదట్నుంచీ కమర్షియల్ హీరోగానే తనని చూశారు ప్రేక్షకులు. మరి ఓ రాజుగా అతను మెప్పిస్తాడా అనే డౌట్ చాలామందిలో ఉంది. దాన్ని కాస్తా పటాపంచలు చేసేశాడు కళ్యాణ్. ఫిజికల్‌గా తనను తాను చాలా మార్చుకున్నాడు. ఇక నటన అయితే అదరగొట్టేశాడు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రలో అతని హావభావాలు, డైలాగ్ డెలివరీ చాలా ఆకట్టుకుంటాయి. బింబిసారుడు ఇలాగే ఉండేవాడేమో అన్నంత బాగా ఆ పాత్రను ఆకళింపు చేసేసుకున్నాడు. ఆ క్యారెక్టర్‌కి తానే పర్‌ఫెక్ట్ అనేంత బాగా పర్‌ఫార్మ్ చేశాడు.ఇది తన కెరీర్ బెస్ట్ రోల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజుని అంటిపెట్టుకుని ఉండే జుబేదా పాత్రలో శ్రీనివాసరెడ్డి నవ్వులు పూయించాయి. ముఖ్యంగా అతని బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్‌గా ఉండి మెప్పించాయి. డైలాగ్స్ పండాయి. కీరవాణి బ్యాగ్రౌండ్ సినిమాకి మరో పెద్ద ప్లస్. నిజానికి ఇలాంటి మూవీస్‌కి పర్‌ఫెక్ట్ బీజీఎం లేకపోతే లీడ్ క్యారెక్టర్లు ఎలివేట్ కావు. ఆ విషయంలో తనను మించినవాళ్లు లేరనిపించారు కీరవాణి. బింబిసారుణ్ని తన మ్యూజిక్‌తో మరింత పైకి లేపారాయన. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాని విజువల్ ఫీస్ట్ గా మార్చింది. మొత్తంగా మూవీ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్ తో ఉంది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి.
ఎవరెవరెలా చేశారంటే...
ఇక హీరోయిన్ల పాత్రలకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. క్యాథరీన్ కాస్త ఫర్వాలేదనిపించింది సంయుక్త రోల్ అసలు అవసరమే లేదనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ పాత్ర కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటివి అసలు ఆయనే చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని పెట్టినా ఫర్వాలేదు అనిపించేంత సింపుల్ రోల్. అయితే దాన్ని కూడా తన స్టైల్‌లో పండించి మెప్పించారాయన. బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, వెన్నెల కిశోర్, అయ్యప్ప పి శర్మలు కూడా పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. అయితే బింబిసారుడి లాంటి బలమైన హీరోకి దీటుగా ఉండే విలన్‌ని పెట్టకపోవడం పెద్ద మైనస్. ఎవరైనా మంచి ఇమేజ్ ఉన్నవారిని పెట్టి ఉంటే మరింత బాగుండేది. పాటలు బానే అనిపించినా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా అయితే లేవు. స్టోరీ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకెండాఫ్ వెనకబడిందనుకోవచ్చు. హీరోలో అంతర్మథనం మొదలవుతుందనే హింట్ ఇచ్చి ఇంటర్వెల్ ఇచ్చారు. ఆ తర్వాత చాలా ఎమోషనల్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారెవరైనా. కానీ అలాంటి సీన్స్ అంతగా పడలేదు. పైగా నేరేషన్ కూడా నెమ్మదించింది. ఫస్టాఫ్‌లో ఉన్న స్పీడ్ ఇక్కడికొచ్చేసరికి లేకపోవడంతో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అలా అని బోర్ కొట్టడానికి అవకాశం లేదు. దానికి కారణం కళ్యాణ్ రామ్. బింబిసార పాత్రకి సంబంధించిన ప్రతి సీన్ పండటంతో అతను ఎంటరైన ప్రతిసారీ ప్రేక్షకుడికి జోష్ వస్తుంది. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడి నేరేషన్‌కే దక్కుతుంది. మొదటి సినిమానే అయినా తన రైటింగ్‌తో ఇంప్రెస్ చేశాడు. డైరెక్టర్‌గానూ ఫుల్ మార్కులు వేయించుకున్నాడు.
కొసమెరుపు: బింబిసారుడు బహు బాగున్నాడు