18 నెలల్లో 2.54 కోట్ల మంది పుట్టారు
చైనాలో జనాభా మళ్లీ పెరుగుతోంది. ‘వన్ చైల్డ్’ పాలసీని ఆ దేశం రద్దు చేసిన 18 నెలల్లో మామూలు కన్నా 54 లక్షల మంది పిల్లలు ఎక్కువ పుట్టినట్టు సర్వేలు చెబుతున్నాయి. ఏటా పుట్టే 2 కోట్ల మందికన్నా మరో 54 లక్షల మంది ఎక్కువ పుట్టినట్టు పెకింగ్ వర్సిటీ సర్వేలో తేలింది.
100 కోట్లకు చేరువవుతుండటంతో..
చైనా జనాభా 100 కోట్లకు చేరువవుతుండటంతో 1979లో ఆ దేశం ‘వన్ చైల్డ్ పాలసీ’ని తీసుకొచ్చింది. దీని వల్ల సుమారు 40 కోట్ల వరకు జానాభా తగ్గింది. కానీ హ్యూమన్ రైట్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్‌ను కొత్త చట్టం ప్రోత్సహించిందని విమర్శలొచ్చాయి. ఇంకోవైపు చైనాలో ముసలివాళ్ల సంఖ్య పెరుగుతుండటంతో ఆ దేశ సర్కారు ఆందోళన చెందింది. మరో 30 ఏళ్లలో దేశంలో పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గుతుందని భయపడింది. వన్ చైల్డ్ పాలసీని ఇలానే కంటిన్యూ చేస్తే 2050 నాటికి 65 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న వారి సంఖ్య ఎక్కువుంటుందని అంచనా వేసింది. ఇది ఇలాగే జరిగితే పని చేసే వాళ్లు తగ్గి చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని భయపడింది.
పెరిగిన రెండో సంతానం
చైనాలోని 9 కోట్ల మంది యువతులే టార్గెట్‌గా టూ చైల్డ్ పాలసీని 2015 అక్టోబర్‌లో డ్రాగన్ దేశం తీసుకొచ్చింది. తర్వాత ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఏడాదికి 2 కోట్ల జననాలే లక్ష్యంగా పెట్టుకోగా పాలసీ మార్పు తర్వాత 54 లక్షల జననాలు పెరిగాయి. పైగా ముసలివాళ్లు కూడా ప్రెగ్నెంట్ అవుతున్నారని పెకింగ్ వర్సిటీ సర్వేలో తేలింది. అప్పటికే ఒక సంతానం ఉన్న వాళ్లు రెండోసారి సంతానాన్ని కనడం పెరిగిందని వెల్లడైంది. ఇది తొలిసారి సంతానం కన్నా ఎక్కువుందని తెలిసింది. ఇంకోవైపు 35 ఏళ్ల కన్నా ఎక్కువున్న వారు పిల్లల్ని కనడం 59 శాతంపెరిగింది. మొత్తంగా 2015 అక్టోబర్ నుంచి 2016 జూన్ వరకు (2 చైల్డ్ పాలసీ మొదలై 9 నెలలు), 2016 జూన్ నుంచి 2017 డిసెంబర్ వరకు జననాల లెక్కలు అంచనా వేశారు.
