
Bitcoin Records: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ప్రస్తుతం ర్యాలీని చూస్తోంది. బంగారం, వెండి లాంటి సాంప్రదాయ పెట్టుబడుల కంటే విపరీతమైన రాబడులను ఈ క్రిప్టో ఇన్వెస్టర్లకు అందిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు బిట్ కాయిన్ తన సరికొత్త జీవితకాల గరిష్ఠమైన లక్ష 25వేల 689 డాలర్ల మార్కును అధిరోహించింది.
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయిన వేళ ఇన్వెస్టర్లు ఈ క్రిప్టో కరెన్సీని కూడా తమ పెట్టుబడుల్లో భాగంగా ఒక సేఫ్ హెవెన్ అసెట్ స్థానాన్ని కల్పిస్తున్నారు. మరో పక్క యూఎస్ డాలర్ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రాబల్యాన్ని కోల్పోతుండటం, డాలర్ విలువ కూడా పడిపోవటం బిట్ కాయిన్ ప్రయోజనం పొందటానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. గడచిన పదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. అక్టోబరు నెలలో బిట్ కాయిన్ 9 ఏళ్లు లాభపడింది. ప్రభుత్వ సంస్థలు కూడా క్రిప్టోలలో ఇన్వెస్ట్ చేయటం వీటి ధరల పెరుగుదలకు మరో కారణంగా తెలుస్తోంది.
ఏఐ పెట్టుబడి ఒప్పందాలతో యూఎస్ మార్కెట్లు జోష్ లో ఉండటంతో కొంత షట్ డౌన్ భయాలు తగ్గినట్లు నిపుణులు అంటున్నారు. షట్ డౌన్ కొనసాగుతున్న సమయంలో క్రిప్టోలు మరింతగా పుంజుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
క్రిప్టో పెట్టుబడులపై నిపుణుల మాట..
బిట్ కాయిన్ లక్షా 25వేల డాలర్ల మార్కును అధిగమించి కొత్త మైలురాయిని చేరుకుంది. ప్రధానంగా బిట్ కాయిన్ లభ్యత ఏడాది నుంచి తక్కువగా ఉండటంతో రేట్ల పెరుగుదలకు దారితీసినట్లు జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. ఇదే క్రమంలో ఈటీఎఫ్, సంస్థాగత పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను పరిశీలిస్తే సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక వ్యవస్థల్లో లిక్విడిటీ పెంచేందుకు వడ్డీ రేట్ల తగ్గింపులకు వెళ్లటంతో ఇన్వెస్టర్లు మంచి రాబడుల కోసం క్రిప్టోలను ఎంచుకుంటున్నట్లు సుబ్బురాజ్ చెబుతున్నారు. గత చరిత్ర కూడా ఇదే చెబుతోంది.
ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ద్రవ్యోల్బణం, కరెన్సీ ఓలటాలిటీలు మరికొన్ని కారణాలుగా క్రిప్టో ర్యాలీకి నిలుస్తున్నాయి. అయితే క్రిప్టోలపై పెరుగుతున్న రెగ్యులేటరీ విధానాలు, టెక్నాలజీ కూడా వీటిని మరింత ఆకర్షనీయ పెట్టుబడిగా చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోలు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల పోర్ట్ ఫోలియోలో స్థానాన్ని సంపాదించుకుంటున్న వేళ లక్షా 25వేల డాలర్ల మార్కు నుంచి బిట్ కాయిన్ రానున్న రోజుల్లో మరింత ర్యాలీని చూడవచ్చని సుబ్బురాజ్ అంచనా వేస్తున్నారు.