రాజస్థాన్​లో మళ్లీ మార్చేశారు!.. కాంగ్రెస్ సర్కార్ ఓటమి.. మళ్లీ బీజేపీకే పవర్

రాజస్థాన్​లో మళ్లీ మార్చేశారు!.. కాంగ్రెస్ సర్కార్ ఓటమి.. మళ్లీ బీజేపీకే పవర్
  • ఆనవాయితీగా రూలింగ్ పార్టీని మార్చిన ఓటర్లు  
  • 115 సీట్లతో బీజేపీ ఘన విజయం.. 69 సీట్లకే కాంగ్రెస్ పరిమితం
  • సీఎం రేసులో వసుంధరా రాజే, దియా కుమారి, తదితరులు

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఓటర్లు ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా ప్రభుత్వాన్ని మార్చేశారు. ఆదివారం ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడిన ఫలితాల్లో ప్రతిపక్ష బీజేపీ 115 సీట్లతో ఘన విజయం సాధించింది. అధికార పార్టీ కాంగ్రెస్ 69 సీట్లకే పరిమితమై మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంలోనే నిలిచిపోయింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకాగా.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మొదట్లో హోరాహోరి పోరు కొనసాగింది. మధ్యాహ్నంకల్లా ఒక్కో సీటులో క్రమంగా బీజేపీ ఆధిక్యం పెంచుకుంటూ పోయింది. సాయంత్రం అయ్యేసరికి సునాయాసంగానే మెజార్టీ మార్కును దాటుకుని వందకుపైగా స్థానాలను కైవసం చేసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా, ఓ అభ్యర్థి మరణం కారణంగా 199 సీట్లకే పోలింగ్ జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ (మ్యాజిక్ ఫిగర్) 101 సీట్లు కాగా, బీజేపీ అంతకంటే 14 సీట్లు ఎక్కువే గెలుచుకుంది. ఎన్నికల బరిలో మొత్తం 1,862 మంది పోటీపడ్డారు. ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 70 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 50 మంది మహిళా క్యాండిడేట్లు బరిలో నిలవగా.. 20 మంది అభ్యర్థులు గెలిచారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ తరఫున 9 మంది చొప్పున, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ స్టేట్ ఆఫీస్ సహా జిల్లా ఆఫీసుల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆదివారం సాయంత్రం సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను
కలిసి రాజీనామా లేఖను అందజేశారు.

30 ఏళ్లుగా మార్పే మంత్రం..

రాజస్థాన్​లో గత మూడు దశాబ్దాలుగా.. అంటే1993 నుంచీ ప్రతీ ఐదేండ్లకోసారి ఓటర్లు అధికార పార్టీని మారుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ లో కుమ్ములాటలు ప్రతిపక్ష బీజేపీకి విజయాన్ని కట్టబెట్టాయి. కాంగ్రెస్ ఏడు గ్యారంటీలు, యునైటెడ్ ఫ్రంట్ పేరుతో విస్తృత ప్రచారం చేసినా.. బీజేపీ గెలుపును ఆపలేకపోయింది. అలాగే కాంగ్రెస్ లో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గాల మధ్య కుమ్ములాటలు సైతం అనేక చోట్ల పార్టీ ఓటమికి దారితీశాయి.

పైలట్ వర్గమూ దెబ్బతీసింది!

2018లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత గుజ్జర్ వర్గం కీలక నేత అయిన సచిన్ పైలట్ కు సీఎం పదవిని ఇవ్వకపోవడంతో ఆ వర్గం వారు ఆగ్రహం చెందారు. తర్వాత 2020లో పైలట్ ఆధ్వర్యంలో జరిగిన తిరుగుబాటుతో దాదాపుగా గెహ్లాట్ సర్కారును కూలదోసినంత పని చేశారు. ఆ వెంటనే పైలట్ ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవుల నుంచి పార్టీ తొలగించడంతో గుజ్జర్లు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజీ ప్రయత్నాలతో గెహ్లాట్ తో పైలట్ కలిసిపోయినట్లు చూపినా.. స్వయంగా పైలట్ పిలుపునిచ్చినా గుజ్జర్ వర్గం ప్రజలు సంతృప్తి చెందలేదు. దీంతో గుజ్జర్ల ప్రాబల్యం ఉన్న తూర్పు రాజస్థాన్ లోని 11 జిల్లాల్లో 59 సీట్లకుగాను కాంగ్రెస్ 19 సీట్లకే పరిమితమైంది. బీజేపీ గత ఎన్నికల కంటే 18 సీట్లు అధికంగా 38 సీట్లను గెలుచుకుంది.   

సీఎం రేసులో ఉన్నది వీళ్లే..

1. వసుంధరా రాజే సింధియా (మాజీ సీఎం)    
2. దియా కుమారి (రాజ్ సమంద్ ఎంపీ)
3. భూపేంద్ర యాదవ్ (కేంద్ర మంత్రి)
4. ఓం బిర్లా (లోక్ సభ స్పీకర్)  
5. గజేంద్ర సింగ్ షెకావత్ (కేంద్ర మంత్రి)
6. అశ్వినీ వైష్ణవ్ (కేంద్ర మంత్రి)
7. బాలక్ నాథ్ (అల్వార్ ఎంపీ)

ఫలితాలు చూసి షాక్ అయ్యా

రాజస్థాన్ ప్రజల తీర్పును హుందాగా స్వీకరిస్తున్నాం. ఈ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వచ్చాయి. ఫలితాలు చూసి నేను షాక్ అయ్యా. మా ప్రణాళికలను, చట్టాలను, ఇన్నోవేషన్లకు ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో మేం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని ఈ ఓటమి తెలియజేసింది. నేను ప్రజా సేవకుడిని. ఎలాంటి పోస్టు లేకపోయినా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తా..

- అశోక్ గెహ్లాట్

గెలిచిన ప్రముఖులు వీళ్లే..

ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున జైపూర్ రూరల్ ఎంపీ, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఝోట్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌధరిపై50,167 ఓట్ల మెజార్టీతో  గెలిచారు. రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే సింధియా ఝాల్రపటాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రామ్ లాల్ పై 53,193 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజ్ సమంద్ ఎంపీగా ఉన్న దియా కుమారి విధ్యాధర్ నగర్ సెగ్మెంట్ నుంచి 70 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొం దారు. ఇక కాంగ్రెస్ తరఫున సర్దార్ పుర స్థానంలో సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీ అభ్యర్థి మహేంద్ర సింగ్ రాథోడ్ పై 26 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ టోంక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ మెహతాపై 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నాథ్ ద్వారా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి విశ్వరాజ్ సింగ్ మేవార్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఈ ఎన్నికల్లో గెహ్లాట్ కేబినెట్ లోని 25 మంది మంత్రుల్లో ఏకంగా 15 మంది ఓటమిపాలయ్యారు. ఐదుగురు సలహాదారులు సైతం పరాజయం చెందారు.

 
 

BJP won the Rajasthan assembly elections. Voters have changed the government this time as per custom.