బీజేపీ, బీఆర్ఎస్​లు ఒక్కటై బీఎస్పీని ఓడించినయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీజేపీ, బీఆర్ఎస్​లు ఒక్కటై బీఎస్పీని ఓడించినయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  •     ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం
  •     సిర్పూర్ ప్రజల పక్షాన పోరాడుతా..
  •     బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్,వెలుగు : సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ రహస్యంగా ఒక్కటి కావడం వల్లే బీఎస్పీ ఓడిపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త సర్సాల, కాగజ్ నగర్ పోలింగ్ కేంద్రాల వద్ద బీఎస్పీ ఏజెంట్లను బీఆర్ఎస్ నాయకులు బెదిరించారని, దాడులు చేసినా ఓటర్లు బీఎస్పీని ఆదరించి ఓట్లేశారన్నారు. బహుజన గొంతుకగా నిలిచి బీఎస్పీకి కొత్త ఆశలు రేకెత్తించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, విజయం సాధించేందుకు శ్రేణులను సిద్ధం చేస్తామన్నారు. సిర్పూర్ ప్రాంతవాసులు తనను దత్తత తీసుకున్నారని, తాను ఓడినా ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటామన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా అధ్యక్షుడు లేండేగూరి శ్యామ్ రావు, నాయకులు మనోహర్ పాల్గొన్నారు.