
న్యూఢిల్లీ: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) మాజీ వైస్ చాన్స్‌లర్ తారిఖ్ మన్సూర్‌ను బీజేపీ ఉపాధ్యక్షుడిగా పార్టీ నాయకత్వం శనివారం నియమించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మన్సూర్.. ఎన్‌ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్ వర్సిటీలో జరిగిన నిరసనలను శాంతియుతంగా అదుపులోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు.
హిందూ, ముస్లిం సంబంధాలపై మొఘల్ యువరాజు దారా షికో బోధనలను ప్రోత్సహించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి పనిచేశారు. దీంతో దళిత, ఇతర వెనుకబడిన తరగతుల నేపథ్యాల నుంచి వచ్చిన పస్మాండ ముస్లిం వర్గాల్లో బీజేపీ విస్తరణకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీని పస్మాండ ముస్లిం వర్గానికి చేరువ చేయడంలో ఆయన నియామకం ఉపయోగపడుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.