వడగళ్ల వాన బీభత్సం.. పంటలను పరిశీలించిన బండి సంజయ్

వడగళ్ల వాన బీభత్సం.. పంటలను పరిశీలించిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ కుమార్ ఏప్రిల్ 24వ తేదీ సోమవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఆదివారం కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ముందుగా కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేటలో వానకు దెబ్బతిన్న పంటలు పరిశీలించి.. రైతులకు ధైర్యం చెప్పారు బండి సంజయ్. రైతులంతా అధైర్య పడొద్దని.. బీజేపీ పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని బండి సంజయ్ కు వివరిస్తూ రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే తమకు పంట నష్ట పరిహారం అందకుండా పోయిందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక కరీంనగర్ ​జిల్లా వ్యాప్తంగా  శనివారం,ఆదివారం కురిసిన వడగండ్ల వానకు 23,709 ఎకరాల్లో పంట నష్టం జరగగా 17,197 మంది రైతులు నష్టపోయినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 22,120 ఎకరాల్లో వరి, 334 ఎకరాల్లో మక్క, 1172 ఎకరాల్లో మామిడి, పుచ్చ, బొప్పాయి తోటలు, 83 ఎకరాల్లో కూరగాయల తోటలు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా చొప్పదండి మండలంలో 8176 ఎకరాల్లో పంట నష్టం జరగగా, 5,757 మంది రైతులు నష్టపోయినట్లు ఆఫీసర్లు తేల్చారు. హుజూరాబాద్ మండలంలో 3,871 ఎకరాల్లో పంట నష్టం జరగగా, 4,013 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు.