రైతుల డబ్బులతో బీజేపీ బాండ్లు

రైతుల డబ్బులతో బీజేపీ బాండ్లు
  • రూ.11 కోట్లు ఇచ్చి కొన్న అదానీ అనుబంధ కంపెనీ
  • శివసేనకూ 1.14 కోట్ల విరాళాలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

న్యూఢిల్లీ: ఎలక్టోరల్  బాండ్ల పేరుతో అదానీ గ్రూప్ కు అనుబంధంగా ఉన్న అదానీ వెల్ప్ సన్  ఎక్స్ ప్లొరేషన్  లిమిటెడ్  అనే కంపెనీ చదువురాని రైతులను నట్టేట ముంచింది. వారికి తెలియకుండా ఎలక్టోరల్  బాండ్లు కొని రూ.11.14 కోట్ల మేర మోసం చేసింది. దళిత కుటుంబానికి చెందిన ఆరుగురు రైతుల భూమిని కొని వారికి డబ్బులు ఇవ్వకుండా వారి పేరుతో ఎలక్టోరల్  బాండ్లను కొనుగోలు చేసింది. చివరకు బాధితులు విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదానీ గ్రూప్ కు అనుబంధంగా ఉన్న అదానీ వెల్ప్ సన్  ఎక్స్ ప్లొరేషన్  లిమిటెడ్  కొన్ని సంవత్సరాల కింద గుజరాత్ లో  కచ్  జిల్లాలోని అంజార్  సిటీలో ఓ దళిత రైతు కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. 

రైతుల డబ్బును వారి బ్యాంకు ఖాతాలో  డిపాజిట్  చేసేటపుడు వెల్ప్ సన్  కంపెనీ సీనియర్  జనరల్  మేనేజర్  మహేంద్ర సింగ్  సోధా.. డబ్బు డిపాజిట్  చేస్తే ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు వస్తాయని, ఆ డబ్బుతో ఎలక్టోరల్  బాండ్లు కొనుగోలు చేస్తే కొన్నేళ్ల తర్వాత 1.5 రెట్లతో రిటర్నులు వస్తాయని నమ్మించాడు. రైతులు అతని మాట నమ్మారు. అయితే, రైతులకు తెలియకుండా నిరుడు అక్టోబర్  11న కంపెనీ మేనేజర్, డైరెక్టర్లు రూ.11.14 కోట్లతో ఎలక్టోరల్  బాండ్లు కొన్నారు. రూ.10 కోట్లను బీజేపీకి, రూ.1.14 కోట్లను శివసేనకు విరాళంగా ఇచ్చారు. 

ఈ విషయం బాధితులకు ఆలస్యంగా తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెల్ప్ సన్  కంపెనీ మేనేజర్  తమను మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలని వారు కంప్లైంట్  చేశారు. వెల్ప్ సన్  డైరెక్టర్లు విశ్వనాథన్  కొల్లెంగోడ్, సంజయ్  గుప్తా, చింతన్  థాకర్, ప్రవీణ్  భన్సాలీ, సీనియర్  జనరల్  మేనేజర్  మహేంద్ర సింగ్  సోధా, ల్యాండ్  అక్విజిషన్  అధికారి విమల్  కిశోర్  జోషి, అంజార్  సిటీ బీజేపీ అధ్యక్షుడు హేమంత్  అలియాస్  డానీ రజినీ కాంత్  షా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వారిపై ఇంకా ఎఫ్ఐఆర్  నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, 2005లో వెల్ స్పన్  నేచురల్  రిసోర్స్  ప్రైవేట్  లిమిటెడ్ తో కలిసి అదానీ వెల్ప్ సన్  ఎక్స్ ప్లొరేషన్  లిమిటెడ్  పేరుతో అదానీ గ్రూప్  జాయింట్  వెంచర్ లోకి ప్రవేశించింది.