పాలమూరు బీజేపీలో పంచాయితీ .. ఎంపీ డీకే అరుణ, పార్టీ స్టేట్ ట్రెజరర్ శాంతి కుమార్ మధ్య వర్గ పోరు

పాలమూరు బీజేపీలో పంచాయితీ .. ఎంపీ డీకే అరుణ, పార్టీ స్టేట్ ట్రెజరర్ శాంతి కుమార్ మధ్య వర్గ పోరు
  • 2019 నుంచి కోల్డ్ వార్​
  •  రెండుగా చీలిపోయిన క్యాడర్​
  •  స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బయటపడ్డ విభేదాలు

మహబూబ్​నగర్​, వెలుగు: పాలమూరు బీజేపీలో పంచాయితీ నడుస్తోంది. ఎంపీ డీకే అరుణ, ఆ పార్టీ స్టేట్​ట్రెజరర్​బండారి శాంతికుమార్​మధ్య ఉన్న విబేధాలు బయట పడ్డాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్​రెండుగా చీలిపోయింది.  

స్టేట్​చీఫ్ ఎదుటే గో బ్యాక్​ నినాదాలు

బీజేపీ స్టేట్​చీఫ్​గా రాంచందర్ రావు బాధ్యతలు తీసుకున్నాక గత శనివారం మొదటిసారి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఓ ప్రైవేట్​ ఫంక్షన్​హాల్​లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎంపీ డీకే అరుణతోపాటు పార్టీ స్టేట్ ట్రెజరర్ బండారి శాంతికుమార్, రాష్ట్ర, జిల్లా లీడర్లు హాజరయ్యారు. అయితే శాంతికుమార్​ను స్టేజీ మీదకు పిలవగానే డీకే అరుణ వర్గం నాయకులు గో బ్యాక్​అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా శాంతికుమార్ వర్గంవారు జిందాబాద్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు.

 ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం సమావేశం ప్రారంభమయ్యాక.. ఎంపీ ఘాటు విమర్శలు చేశారు. కొందరి పేర్లు నేను తీసుకోను.. ఆ కొందరే గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ లైన్ క్రాస్ చేశారు.. జై శ్రీరామ్​ అంటాం కదా! శ్రీ రాముని మీద ఒట్టేసి చెప్పండి. మీరంతా బీజేపీకి అనుకూలంగా పని చేశారా? గత ఎన్నికల్లో నేను ఓడిపోవాలని ఎవరు పని చేశారో, అనుకూలంగా ఎవరు పని చేశారో పార్టీ వద్ద రిపోర్ట్​ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా పలువురితో రాజీనామా చేయించినోళ్లు ఇవాళ  మీటింగ్ కు రావడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

శాంతికుమార్​కు రెండుసార్లు చేజారిన టికెట్..​

మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండారి శాంతికుమార్​ కొన్నేండ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. 2019 పార్లమెంట్​ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన గ్రౌండ్​వర్క్​ చేసుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల స్థానం నుంచి పోటీ చేసిన డీకే అరుణ ఓడిపోయారు.  తర్వాత ఆమె బీజేపీలో చేరి, మహబూబ్​నగర్​ ఎంపీ టికెట్​దక్కించుకున్నారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్​ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ శాంతికుమార్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. హైకమాండ్ అరుణకే  కేటాయించింది.  ఆమె ఎంపీగా గెలిచారు. రెండుసార్లు శాంతికుమార్​కు టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దీంతో అప్పటినుంచి ఇద్దరి మధ్య  కోల్డ్​వార్ ​నడుస్తోంది.

బీసీ సంఘాల లీడర్ల ఆరోపణలు

బీజేపీ కార్యకర్తల  సమావేశంలో బీసీ లీడర్​కు అవమానం జరిగిందంటూ బీసీ సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులను బీజేపీ అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు.  శాంతికమార్​కు ఎంపీ డీకే అరుణ క్షమాపణలు చెప్పకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారు. బీజేపీకి చెందిన బీసీ లీడర్లు మాత్రం డీకే అరుణ, శాంతికుమార్ మధ్య విబేధాలు పార్టీకి సంబంధించిన వ్యవహారమని చెబుతున్నారు.