కవిత ఇంటిని ముట్టడిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా ?

కవిత ఇంటిని ముట్టడిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి వెళ్లిన బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తారా అని టీఆర్ఎస్ సర్కారును బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాం. 8 ఏళ్లలోనే మన గతి ఇట్లా అవుతుందని ఎవరూ ఊహించలేదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో టెక్స్ట్ బుక్స్ రాలేదు. ఫుడ్ బాగా లేదని బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసీఆర్ నిర్వాకం వల్ల ప్రభుత్వ ఆస్పత్రులకు పేదలు వెళ్లే పరిస్థితి లేదు’’ అని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినా ఆయన మీద టీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాక.. మునుగోడులో అభివృద్ధి పనులు మొదలయ్యాయని గుర్తు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. చేనేత కార్మికులపై జీఎస్టీ ఉండదని.. దీనిపై తప్పుడు ప్రచారంతో వారిని తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని ఆయన వివరించారు. ప్రధాని మోడీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ వాడుతున్న భాష సరిగ్గాలేదని, దాన్ని మార్చుకోవాలని విశ్వేశ్వర్ రెడ్డి హితవు పలికారు. భువనగిరి ఎయిమ్స్, రాష్ట్రంలో అనేక జాతీయ రహదారులు ప్రధాని మోడీ  హయాంలోనే వచ్చాయన్నారు. ‘‘గ్రామ పంచాయతీలకు నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అయితే ఆ నిధులను నేరుగా పంచాయతీలకు కాకుండా తనకు ఇవ్వాలని కేసీఆర్ అంటున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.