మునుగోడు తీర్పుతో నీ ఫ్యామిలీ జైలుకే: రాజగోపాల్​

మునుగోడు తీర్పుతో నీ ఫ్యామిలీ జైలుకే: రాజగోపాల్​

యాదాద్రి​, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్​తోనే తాను యుద్ధం చేస్తున్నానని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్​.. నీ అవినీతి సొమ్మును నీ బానిసలైన ఎమ్మెల్యేలు ఇస్తే తిని తాగి జనం ఓటేస్తారనుకున్నవా. మునుగోడు ప్రజల తీర్పుపై తెలంగాణ భవిష్యత్​ ఆధారపడి ఉంది. చరిత్రలో నిలిచిపోయే తీర్పు మునుగోడు ప్రజలు ఇస్తరు. ఈ తీర్పుతో నీ ప్రభుత్వం కూలిపోతది. నీ కూతురు ఇప్పటికే లిక్కర్​ స్కామ్​లో ఉన్నరు. మీరంతా లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డరు. నీతో పాటు కేటీఆర్​, హరీశ్​, సంతోష్​ జైలుకు పోవడం ఖాయం. మీ కోసం కొత్త జైలు కట్టాల్సి వస్తది” అని మండిపడ్డారు. ఉప ఎన్నిక  ప్రచారంలో భాగంగా  నల్గొండ జిల్లా మునుగోడు నుంచి యాదాద్రి జిల్లా సంస్థాన్​ నారాయణపురం మీదుగా చౌటుప్పల్​ వరకు రాజగోపాల్​ బైక్​ ర్యాలీ నిర్వహించారు. తర్వాత పంతంగి వద్ద చేపట్టిన రోడ్ ​షోలో మాట్లాడుతూ.. కేసీఆర్​కు గర్వం పెరిగిందని దుయ్యబట్టారు. ‘‘2014 వరకూ సంపాదన లేని కేసీఆర్​.. ప్రాజెక్టుల పేరుతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెట్టిండు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డడు. ఆ డబ్బు ఉందన్న అహంకారంతో నియంతగా మారిండు. నేను గెలిపించిన చిరుమర్తి లింగయ్య సహా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను కొనేసిండు” అని మండిపడ్డారు.  ప్రతిపక్షమనేదీ లేకుండా చేయాలనుకున్నారని.. కానీ, ఈ అవినీతి కేసీఆర్​ను పులి లాంటి బీజేపీ చావు దెబ్బ తీస్తుందన్నారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా జీవో తెచ్చారని దుయ్యబట్టారు. 

కౌరవ సైన్యం దిగింది
మునుగోడు అభివృద్ధి కోసమే  తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో దిగానని రాజగోపాల్ అన్నారు. ‘‘నా రాజీనామా కారణంగా వచ్చిన ఈ ఎన్నికను ఎదుర్కోలేక కేసీఆర్​, కేటీఆర్​ రాత్రిళ్లు నిద్ర కూడా పోతలేరు. నన్ను ఎదుర్కోవడానికి కేసీఆర్​ బానిసలు, జీతగాళ్లు అయిన ఎమ్మెల్యేల కౌరవ  సైన్యం దిగింది. సిగ్గులేని ఈ ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లోని సమస్యలను పక్కన పెట్టి ఇక్కడ తిరుగుతున్నరు” అని విమర్శించారు. నియంత పాలన పోవాలంటే మునుగోడు ధర్మయుద్ధంలో బీజేపీని గెలిపించాలని కోరారు. 

భారీ బైక్​ ర్యాలీ
మునుగోడు నుంచి భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, ఎంపీ అర్వింద్​, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి వెంట రాగా.. పుట్టపాక మీదుగా సంస్థాన్​ నారాయణపురం, చౌటుప్పల్​ మండలాల్లో బైక్​ ర్యాలీ సాగింది. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. చౌటుప్పల్​ టౌన్​లో రోడ్​ షో నిర్వహించారు. మాజీ ఎంపీలు రమేష్ రాథోడ్, బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం పాల్గొన్నారు.