అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి

అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి

వ్యవసాయ మోటార్ల వద్ద మీటర్లు పెడితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది అంటూ కేంద్రంపై ఆరోపణలు చేస్తూ..సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో కేవలం ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసేందుకు సమావేశాలను ఉపయోగించుకున్నారని విమర్శించారు. కేవలం 18 నెలల్లో మోడీని ఇంటికి పంపిస్తానని అంటున్న సీఎం కేసీఆర్.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం పలు ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగింది. 

పార్లమెంట్ లో ప్రతి బిల్లుపై చర్చ జరుగుతుందని, కానీ తెలంగాణ అసెంబ్లీలో అలాంటివి జరగవని బండి సంజయ్ అన్నారు. మోటార్ల వద్ద మీటర్లు పెడుతామనే అంశమే రాలేదని, అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. దీనిపై తప్పు అని నిరూపిస్తానని తాను సవాల్ విసిరినా.. ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డిస్కమ్ లకు డబ్బులు కట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పాతబస్తీలో విద్యుత్ బిల్లులు కట్టకున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రావొద్దని కోరుకున్న మొదటి వ్యక్తి కేసీఆర్ అని, గతంలో ఉద్యమంలో పాల్గొన్న వారే ఈ విషయాన్ని చెప్పారని తెలిపారు.